ఒక పార్టీని వీడి వీరుడిలా బయటకు వచ్చే వ్యక్తి ముందుగా చేయాల్సిన పని పదవులను వదులుకోవడం. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన హోదాలకు రాజీనామా చేసి.. పదవీ త్యాగం చేస్తే వాళ్లు వీరులవుతారు. అది కాకుండా.. మరేం వాదించినా అదంతా చేతగాని తనం మాత్రమే. అది కూడా అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చే తెగువకు సిద్ధమైన వాళ్లు ముందుగా పదవులకు రాజీనామా చేయాలి. తమ హీరోయిజం గురించి భారీ అంచనాలున్న వాళ్లు రాజీనామా పత్రాలను విసిరి కొట్టి సత్తా చూపాలి.
రాజకీయ నేతల్లో యువకుడు లాంటి వ్యక్తి, తండ్రి కాలం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, తనకు కాంగ్రెస్ ప్రాధాన్యత దక్కలేదని ఫీలవుతున్న వ్యక్తి అయిన సచిన్ పైలట్ ఆ పార్టీని వీడినప్పుడు ముందుగా చేయాల్సిన పని రాజీనామా. ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష హోదాల్లో ఉండిన సచిన్ వాటికి తనే తెగువగా రాజీనామా చేసి ఉంటే, ఆ ఊపు వేరు!
ఉరుము లేని పిడుగులా రాజీనామా విషయాన్ని ప్రకటించి, తనతో వచ్చే ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించి ఉంటే.. అప్పుడు సచిన్ పైలట్ కచ్చితంగా హీరో అనిపించుకునేవాడు. ఎప్పుడైతే ఆయన రాజీనామా చేయకుండా వెళ్లి దాగి, కాంగ్రెస్ వాళ్లే ఆయనను ఆ పదవుల నుంచి తప్పించే పరిస్థితిని కల్పించాడో అప్పుడు సచిన్ డిఫెన్స్ లో పడిపోయినట్టుగా అయ్యింది. కాంగ్రెస్ పై చేయి సాధించినట్టుగా అయ్యింది.
కాంగ్రెస్ ను వీడి వచ్చే వాళ్లు, తమ సొంత సత్తా మీద నమ్మకం ఉన్న వాళ్లు వైఎస్ జగన్ లా పోరాడగలిగే శక్తి ఉన్న వారై ఉండాలి. మొదటి రోజే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తన వర్గం చేత కూడా రాజీనామా చేయించగలిగితే వారి మీద జనాలకూ కొంత నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా.. ఎన్నికల్లో కూడా గెలవలేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సింధియా బీజేపీలో బీ టీమ్ లా మిగిలిపోయినట్టుగా, ఇప్పుడు వ్యూహం లేకుండా కనిపిస్తున్న సచిన్ పైలట్ లా ఉంటుంది పరిస్థితి!