అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. జగన్ సర్కార్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అబద్ధాలు చెప్పడం కూడా చేతకాదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఎటూ నిజాలు చెప్పరు. అందువల్ల సజ్జల మాటల్లోని నిజాయితీ, నిజాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన మాటల్లోని అతిశయోక్తి గురించే బాధంతా.
ఇంటి పేరుకు తగ్గట్టు రామకృష్ణారెడ్డి సజ్జనుడే. కానీ ఆయన ఉన్న రంగం మాత్రం అంత మంచిది కాదు. రాజధానిపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియా ముందుకు వచ్చాడు.
టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పాడు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. కాకపోతే వాళ్లందర్నీ తీసుకుని తామేం చేయాలని ఆయన ప్రశ్నించాడు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఓ వ్యూహం ప్రకారం జగన్ సర్కార్ కోసం రాజీనామా చేసి గైర్హాజరయ్యాడు. ఆయన్ను పక్కన పెడదాం. ఇక పోతుల సునీత, దేవగుడి శివనాథరెడ్డిలతో ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? వారిద్దరిని ఏం చేసుకుందామని వైసీపీ వైపు రప్పించుకున్నారు?
అలాగే వల్లభనేని వంశీ, మరో టీడీపీ ఎమ్మెల్యేకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించి వైసీపీ సర్కార్ ఎలాంటి నైతికత పాటిస్తోందో సజ్జల చెబుతాడా? మండలిలో కీలక సమయంలో ఎలాంటి వ్యూహం లేకుండా బొక్క బోర్లాపడ్డ వైసీపీ….కింద పడ్డ తమదే పైచేయి అన్నట్టు…నీతి, నైతికతల గురించి ఆ పార్టీ నాయకులు ఉపన్యాసాలు చెబుతున్నారు.