ఏ అంశం దొరక్క చివరికి కరోనాతో కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. కర్నూలులో వెలుగులోకొచ్చిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపాలని హెచ్చరించారు.
“అంధ్రప్రదేశ్ లో, మరీ ముఖ్యంగా కర్నూలులో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పుట్టుకొచ్చిందని, అది మరింత ప్రమాదకరమని చంద్రబాబు ప్రచారం చేశారు. అదింకా సైంటిస్టుల పరిథిలో ఉందని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అలా చంద్రబాబు పరిథిలో లేని, అతడికి అవగాహన లేని ఈ తప్పుడు ప్రచారం వల్ల ఢిల్లీ ప్రభుత్వం ఏపీ నుంచి వస్తున్న వ్యక్తులపై ఆంక్షలు విధించింది. రాజకీయం కోసం చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం ఇది.”
కనీసం మిడిమిడి జ్ఞానంతో కూడా చంద్రబాబు మాట్లాడ్డం లేదని, పూర్తి అజ్ఞానంతో బాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు సజ్జల. సైంటిస్టుల కంటే తనకే ఎక్కువ తెలుసనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
“చంద్రబాబు చేస్తోంది తప్పుడు ప్రచారమని అంతా ఖండిస్తున్నారు. స్వయంగా సీసీఎంబీ డైరక్టర్ వివరణ ఇచ్చారు. ఎన్440కే రకానికి చెందిన వైరస్ ప్రమాదకరం కాదని సూటిగా చెప్పారు. దాని ప్రభావం 5 శాతం మాత్రమేనని అన్నారు. ఓవైపు ఇలా రీసెర్చ్ జరుగుతుంటే, సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేస్తుంటే, చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.”
దీనికి సంబంధించి చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా చంద్రబాబు మాట్లాడారంటూ.. ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని నాన్‌బెయిల్ సెక్షన్లు కింద బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.