సజ్జనార్, సవాంగ్.. ఒకరు తెలంగాణలో కీలక పోస్ట్ లో ఉన్నారు. ఇంకొకరు ఏపీలో కీలక శాఖ నుంచి బదిలీ అయి, మరో కీలక శాఖకు వచ్చారు. విచిత్రం ఏంటంటే.. ఇద్దరూ పోలీస్ బాస్ లే కానీ, ఇప్పుడు ఇద్దరికీ ఖాకీ యూనిఫామ్ లేదు. దానికి సంబంధంలేని మరో కీలక బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు.
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న సజ్జనార్.. దిశ అత్యాచార ఘటన, తదనంతరం జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు బదిలీ అయ్యారు. ఆ సంస్థ అధినేతగా ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏపీలో లాగా తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదు. ఆ సంస్థ కష్టాలు, నష్టాలు, జీతాలు, ఇతర సవాళ్లు.. అన్నీ వారివే. అయితే సజ్జనార్ సార్ వచ్చాక టీఎస్ఆర్టీసీ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోతున్నాయి.
యూజర్ ఫ్రెండ్లీ లాగా ప్రయాణికుల ఫ్రెండ్లీగా టీఎస్ఆర్టీసీ మంచి పేరు తెచ్చుకుంటోంది. పండగల వేళ అదనపు చార్జీలు లేకుండా మేనేజ్ చేయగలగడంతో ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్నే ఏరికోరి ప్రయాణాలకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీనికితోడు సోషల్ మీడియా ప్రచారం కూడా మొదలైంది. రాయితీలు, ఆఫర్లు, ఇలా ఒకటేంటి.. తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ కి ముందు, సజ్జనార్ తర్వాత అన్నంతగా మారిపోయింది.
సోషల్ మీడియాలో అయితే టాలీవుడ్ హీరోలను తెగ వాడేసుకుంటున్నారు సజ్జనార్. అడ్వర్టైజ్ మెంట్లతో ఆర్టీసీ బస్సుల్ని ఆడేసుకోవాలనుకుంటున్న ప్రైవేటు సంస్థలకు కూడా ఆయన సింహస్వప్నంగా మారారు. రైట్ రైట్ అంటూ తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్న సజ్జనార్, లా అండ్ ఆర్డర్ కి దూరం అయినా మరో రూపంలో తన అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు.
సవాంగ్ బాస్ పరిస్థితి ఏంటి..?
డీజీపీగా పనిచేసి బదిలీపై ఏపీపీఎస్సీకి చైర్మన్ గా వచ్చారు గౌతమ్ సవాంగ్. ఏపీ విభజన తర్వాత ఇప్పటివరకూ ఏపీపీఎస్సీ సక్రమంగా పనిచేసింది లేదనే చెప్పాలి. ఉద్యోగ నియామకాలపై నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా, ఎప్పటికప్పుడు ఖాళీలు, ఇతరత్రా వ్యవహారాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పద్ధతి ప్రకారం వాటి భర్తీకి చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఏపీపీఎస్సీనే.
రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఈ పోస్ట్ ని గౌతమ్ సవాంగ్ చేతిలో పెట్టారు జగన్. ఇప్పటివరకూ లాఠీ పట్టుకున్న ఆయన, ఇప్పుడిక ఫైళ్లతో కుస్తీ పడాలన్నమాట. అలవాటు లేని పని, అలవాటు చేసుకున్నా కాస్త కష్టతరమైన బాధ్యత. మరి దీన్ని సవాంగ్ ఎలా నిర్వహిస్తారు. తనపైన పెట్టిన బాధ్యతని భారంగా భావిస్తే అందరిలాగే వానప్రస్థాశ్రమంగా భావిస్తారు. లేదూ, ప్రభుత్వానికి పేరు తెచ్చేలా, నిరుద్యోగులకు మంచి జరిగేలా పనిచేయాలంటే సవాంగ్ సవాళ్లను స్వీకరించాలి.
తన హయాంలో ఎన్ని పోస్ట్ లు భర్తీ చేయగలిగారో, నిరుద్యోగులకు ఎంత మేలు చేయగలిగారో రిటైర్మెంట్ రోజు చెప్పుకోగలగాలి. సవాంగ్ ముందున్న సవాల్ ఇది. అక్కడ లాఠీ పక్కనపెట్టిన సజ్జనార్ కొత్త బాధ్యతల్లో పూర్తిగా సక్సెస్ అయ్యారు, ఇక్కడ లాఠీకి విశ్రాంతి ఇచ్చిన సవాంగ్ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.