ఒక వార్త రాయడంలో సాక్షి పడ్డ కష్టాలు చూస్తే జాలేస్తోంది. సాక్షి కష్టాలు శత్రు మీడియాకు కూడా వద్దనిపించేలా ఉన్నాయి. నిజానికి ఆ వార్త రాయడానికి సాక్షి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ తీర్పు విషయమేమీ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేది కూడా కాదు. ఇంకా చెప్పాలంటే జగన్ కృషిని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై గురువారం ఓ కీలక తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు తాగు, సాగునీటిని తీసుకెళ్లే సదాశయంతో ఇటీవల జగన్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి కరవు కాటకాలకు గురవుతూ నానా యాతన పడుతోంది. వానలు కురవక, సాగునీటికి నోచుకోని రాయలసీమ రైతాంగం కరవుకాటకాలతో చచ్చేందుకు బతుకుతున్నట్టుగా దయనీయ స్థితిలో కాలం గడపాల్సి వస్తోంది.
ప్రకృతితో పాటు పాలకులు పగబట్టడంతో రాయలసీమ భవిష్యత్ అగమ్యమైంది. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో బతుకుపై ఆశలు చిగురించాయి. అయితే ప్రాజెక్టులు పూర్తి కాకుండానే వైఎస్సార్ మన నుంచి దూరమయ్యాడు. ఆయన ఆకస్మిక మరణంతో ప్రాజెక్టుల నిర్మాణం కూడా ప్రశ్నార్థకమైంది.
చంద్రబాబు హయాంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టులు అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. మరోవైపు రెండు పంటలు పండే తన అత్తింటి వాళ్లకు మూడో పంటకు కూడా నీళ్లు ఇచ్చేందుకు పట్టిసీమ కట్టిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో 2019లో ప్రజల భారీ అంచనాల మధ్య వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా రాయలసీమను కరవు రక్కసి నుంచి విముక్తి చేయడానికి ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. అయితే తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పని సరి అని తేల్చి చెప్పింది.
ఇందులో జగన్ ప్రయత్న లోపమేమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురని నిన్నటి నుంచి ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. ఎల్లో మీడియా ట్రాప్‌లో పడిన సాక్షి దినపత్రిక ఎన్జీటీ తీర్పును ఎలా రాయాలో అర్థం కాక …తికమకకు గురైందని, నేడు ఆ పత్రికలో రాసిన వార్తే చెబుతోంది.
“కరవు ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు సీమ ఎత్తిపోతల అవసరమే” అనే శీర్షికతో ఆ వార్తను ప్రచురించింది. ఎన్జీటీ తీర్పును సాక్షి అర్థం చేసుకున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఆ వార్తను రాయకపోయినా గౌరవంగా ఉండేది. తాను గందరగోళానికి గురవుతూ, ప్రజల్ని కూడా అదే కన్ఫ్యూజన్‌లోకి నెట్టి వేయడం ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. సాక్షిలో ఆ వార్తను రాసిన తీరు మరింత భయపెట్టింది.
“రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నటీని మళ్లించి , వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది” అని రాసుకొచ్చింది.
అసలు విషయాన్ని చెప్పడానికి, తీర్పునకు పొంతనలేని సమాచారాన్నంతా ఎలా రాశారో చూడొచ్చు. సాక్షి వార్తను చదువు తుంటే రాంగోపాల్‌వర్మ సినిమా చూసినట్టుంది.
రాయలసీమలో పంటలు బదులు కరవులు పండుతాయని, అలాంటి ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి అపర భగీరథుడిలా యజ్ఞం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అడ్డంకులు ఎలా ఎదురవుతున్నాయో ఆవిష్కరించాల్సిన సాక్షి …నిస్సహాయంగా, చేష్టలుడిగి కలాలను పక్కన పడేయడం ఆందోళన కలిగిస్తోంది.