చిన్నమ్మ రిటర్న్స్.. తమిళ రాజకీయం హీట్?

తమిళనాడు అసెంబ్లీ సార్వాత్రిక ఎన్నికల్లోపే జైలు నుంచి విడుదల కానున్నారట శశికళ. జనాలు కొంతకాలంగా శశికళను పూర్తిగా మరిచిపోయారు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణానంతరం చక్రం తిప్పే ప్రయత్నంలో శశికళ బోల్తా పడ్డారు. బీజేపీ…

తమిళనాడు అసెంబ్లీ సార్వాత్రిక ఎన్నికల్లోపే జైలు నుంచి విడుదల కానున్నారట శశికళ. జనాలు కొంతకాలంగా శశికళను పూర్తిగా మరిచిపోయారు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణానంతరం చక్రం తిప్పే ప్రయత్నంలో శశికళ బోల్తా పడ్డారు. బీజేపీ వాళ్ల సహకారం అందకపోవడంతో.. జయలలిత కు కూడా తప్పిన జైలు శిక్షను శశికళ అనుభవిస్తూ ఉన్నారు.

ఆమె జైలు పాలు కావడంతో.. చివరకు ఆమె నియమించిన ముఖ్యమంత్రి కూడా ఆమె మాట వినకుండా తయారయ్యాడు. డమ్మీ ముఖ్యమంత్రి అనిపించుకున్నా.. ఎంచక్కా సీఎంగా కొనసాగుతూ ఉన్నాడాయన. ఇలాంటి నేపథ్యంలో శశికళ త్వరలోనే విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది. అతిత్వరలో విడుదల కాకపోయినా… అసెంబ్లీ ఎన్నికల్లోపు మాత్రం ఆమె విడుదల అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

శశికళ జైలు నుంచి తిరిగి వచ్చినా..ఆమె అన్నాడీఎంకేపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపగలదు అనే అంచనాలే ఉన్నాయి. శశికళ సంబంధీకులు దినకరనే ఇప్పటికీ అన్నాడీఎంకేను ముప్పుతిప్పలు పెడుతూ  ఉన్నాడు. ఒకవేళ కేంద్రంలోని మోడీ సర్కారు అండ అన్నాడీఎంకేకు లేకపోతే.. దినకరన్  ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో కుప్పకూల్చేవాడు. 

ఇక అన్నాడీఎంకేకు బీజేపీ ఎంతగా రాసుకుపూసుకు తిరుగుతున్నా జనాలు మాత్రం ఈ కూటమిని ఆదరించడం లేదు. లోక్ సభ ఎన్నికలతో అది రుజువు అయ్యింది.

ఇలాంటి పరిణామాల మధ్యన ఎన్నికల నాటికి శశికళ విడుదల అయితే.. ఆ కథ వేరేలా ఉండవచ్చు. అప్పటికి ఎన్నికలు సమీపిస్తే అన్నాడీఎంకే నేతలు చాలా మంది శశికళ కుంపట్లోకి చేరే అవకాశాలు లేకపోలేదు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.