ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా టెన్షన్ మాత్రమే కనిపిస్తోంది. రోడ్లపై విదేశీయులు కనిపిస్తే చాలు స్థానికులు భయంతో వణికిపోతున్నారు. దీనికి తోడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చారని తెలిస్తే ఆ భయం రెట్టింపు అవుతోంది. సరిగ్గా ఇలాంటి టెన్షనే సత్తెనపల్లిలో కనిపించింది. అక్రమంగా 10 మంది విదేశీయులు ఉంటున్నారని తెలుసుకున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఓ మసీదులో అక్రమంగా 10 మంది విదేశీయులు ఉన్నట్టు స్థానికంగా ఉన్న వీఆర్వో గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించిన సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు పొక్కడంతో సత్తెనపల్లిలో నిన్నంతా హై-టెన్షన్ కొనసాగింది. ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్ కు చెందిన 10 మంది వ్యక్తులు విజిటింగ్ వీసాల మీద ఇండియాకు వచ్చారు. వచ్చి సత్తెనపల్లిలోని మసీదులో సెటిల్ అయిపోయారు. లాక్ డౌన్ కారణంగానే వాళ్లు ఇండియాలో ఉండిపోయి ఉంటారని భావించినప్పటికీ.. వాళ్లకు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
లాక్ డౌన్ టైమ్ లో విదేశీయులు, విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఏదో ఒక ప్రభుత్వ అధికారికి ఆ సమాచారం ఇవ్వాలి. అలాంటి సమాచారం ఇవ్వకుండా వీళ్లంతా అక్రమంగా మసీదులో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పైగా లాక్ డౌన్ టైమ్ లో ఢిల్లీ నుంచి వీళ్లు సత్తెనపల్లికి ఎలా రాగలిగారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు ఈ 10 మంది విదేశీయులకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.