మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో మార్పులు తీసుకొచ్చినందుకా? లేక ఆ పదవి నుంచి తన వాడైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తప్పుకోవాల్సి వచ్చినందుకా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బాబు ఆక్రోశమంతా తన సామాజిక వర్గానికి చెందిన అధికారిని తొలగించడమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే గవర్నర్‌కు చంద్రబాబు రాసిన లేఖలో నిప్పులాంటి నిజాలు చెప్పారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తప్పు పడుతూ రాసిన లేఖలో బాబు ఆవేదనలోని డొల్లతనం బట్టబయల్దైంది. అదెలాగో తెలుసుకుందాం.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అర్ధాంతరంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు, వాటికి వంత పాడే ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపును అడ్డుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖను జాగ్రత్తగా గమనిస్తే జగన్ సర్కార్‌కు అనుకూలంగా ఉంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ ప్రస్తుత కమిషనర్ పదవీ కాలం ముగిసన తర్వాతే మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటికిప్పుడు అమలు చేయడం అప్రజాస్వామికం, చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. ఎస్ఈసీని తొలగించాలనే దురుద్దేశంతోనే వైసీపీ సర్కార్ ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994, సెక్షన్ 200కి సవరణ తెచ్చిందంటూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు బాబు లేఖ రాశారు. న్యాయాన్ని, ప్రజాస్వామ్య విలువలను రక్షించేందుకు ఇలాంటి అనైతిక చర్యలను అడ్డుకోవాలని లేఖలో కోరారు.
లేఖలో బాబు ప్రస్తావించిన ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ ప్రస్తుత కమిషనర్ పదవీ కాలం ముగిసిన తర్వాతే మాత్రం అమలు చేయాల్సి ఉంటుందని ఒక మాజీ ముఖ్యమంత్రి గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి జగన్ సర్కార్ తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధమైతే నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసన తర్వాత మాత్రం అమలుకు ఎలా నోచుకుంటుంది? జగన్ సర్కార్ చర్య అనైతికమైనప్పుడు….నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తర్వాత అమలు చేయాలని బాబు ఎలా డిమాండ్ చేస్తున్నారు.
కేవలం నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎస్ఈసీని నియమించుకోండని బాబు లేఖ చెప్పకనే చెబుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కేవలం తన మనిషైన నిమ్మగడ్డను కొనసాగించాలనేదే బాబు ప్రధాన డిమాండ్. అంతే తప్ప రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై గౌరవం, ప్రేమతో కాదు.
ఆర్డినెన్స్ అమలుపై బాబు అభిప్రాయం ఏంటి? ఎప్పటి నుంచి ఎలా అమలు చేయాలో చెప్పడానికి బాబు ఎవరు? ఆయనకున్న అధికారం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న తర్వాత కూడా…కొన్ని రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని అధికారాన్ని చెలాయించాలనే కుట్రలో భాగంగానే నిమ్మగడ్డ కొనసాగింపుపై చంద్రబాబు పట్టు పడుతున్నారని అర్థమవుతోంది.
ఒక వైపు నిమ్మగడ్డ పదవీ కాలం తర్వాత ఆర్డినెన్స్ ప్రకారం నడుచుకోవాలని కోరుతూ, మరోవైపు ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కొనసాగించి న్యాయాన్ని, ప్రజాస్వామ్య విలువలను రక్షించాలని గవర్నర్‌కు ఓ అప్రజాస్వామిక వాది అయిన చంద్రబాబు లేఖ రాయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.