కేజ్రీవాల్….ఢిల్లీలో హ్యాట్రిక్ సాధించిన మొనగాడు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్, బీజేపీలను వరుసగా మూడోసారి మట్టి కరిపించి యావత్ భారతదేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి. సామాన్యుల్లో కెల్లా సామాన్యుడు. రాజకీయ వ్యూహాల్లో కొమ్ములు తిరిగిన నేతలను సైతం ఓడించిన అసామాన్యుడు. మాటల మనిషి కాదు….చేతల మనిషి అని పేరు తెచ్చుకున్న రాజకీయ నేత. సివిల్ సర్వీసెస్ ఉన్నతోద్యోగి అయిన కేజ్రీవాల్…రాజకీయ రంగంలో అడుగు పెట్టి సివిల్ సొసైటీకి సర్వీసెస్ అందిస్తున్న స్ఫూర్తిదాయక నేత.
సమాజం తనకెంతో ఇచ్చిందని, రుణం తీర్చుకునేందుకు, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకుగా ఉండేందుకు రాజకీయాల్లో పవన్‌కల్యాన్ వచ్చాడు. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టాడు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? పార్టీ పెట్టిన వెంటనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మిత్రపక్షానికి మద్దతుగా ప్రచారం చేశాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మళ్లీ వచ్చాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కనీసం తాను కూడా గెలుపొందలేకపోయాడు.
ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని…సినిమా షూటింగ్‌ల్లో నిమగ్నమయ్యాడు. ఆరు నెలలకో, ఏడాదికో ప్రజలకు కనిపిస్తూ….రాజకీయాల్లో తానూ ఉన్నానని చెప్పుకునేందుకు ముఖం చూపించి వెళుతుంటాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేతగా కేజ్రీవాల్ రాజకీయ పంథాను పవన్ ఏనాడైనా అధ్యయనం చేశాడా? చేసి ఉంటే పవన్ ఇలా ఎందుకు పనికి రాకుండా అయ్యేవాడా?
ఎంతసేపూ సినిమాల్లో కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, వచ్చి ఏం చేశానని ఒక్కనాడైనా కనీసం తన అంతరాత్మను ప్రశ్నించుకున్నాడా? కేజ్రీవాల్ ఒక్కసారిగా ముఖ్యమంత్రి కాలేదు. ఆయన వెనుక రోజుల తరబడి శ్రమ, పట్టుదల దాగి ఉన్నాయి.
ఢిల్లీ లాంటి మహానగర ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే మాటలతో పని అయ్యేది కాదు. చైతన్యవంతులైన అక్కడి ప్రజలు కేజ్రీవాల్ ఆచరణ చూసే అందలం ఎక్కించారు. ఆ పని పవన్ ఎందుకు చేయలేకపోయాడు? చేగువేరా గురించి చెప్పడమే తప్ప ఆచరణ ఏదీ? కేజ్రీవాల్‌కు కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా తీరిక లేకుండా పవన్ సినిమా షూటింగ్‌ల్లో మునిగిపోయాడు. ఇదన్నమాట పవన్ సేవ. రాజకీయాల్లో ఎలా ఉండాలో కేజ్రీవాల్ రోల్ మోడలైతే….ఎలా ఉండకూడదో పవన్‌కల్యాణ్ రోల్ మోడల్. ఇప్పటికైనా కేజ్రీవాల్‌ను చూసి పవన్ బుద్ధి తెచ్చుకుంటే మంచిది.