'కరువు చంద్రబాబు నాయుడు కవలపిల్లలు.. చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే కరువే..' అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారాన్ని హోరెత్తించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పంటలు పండవు.. అనేనానుడి ప్రజల్లో కూడా బాగా చర్చనీయాంశంగా నిలిచింది. అదేం దరిద్రమో కానీ.. గత ఐదేళ్లలో రాయలసీమలో కరువు విలయతాండవం చేసింది. వేరుశనగ వంటి పంటలు వర్షాలు లేక రైతులకు ప్రతియేటా నష్టాలే మిగిల్చాయి. అంతేకాదు.. ఆఖరికి పచ్చని చెట్లు కూడా భగ్గుమని మండిపోయినట్టుగా ఎండిపోయాయి.
అనంతపురం జిల్లాలో.. అంతవరకూ మంచినీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో, పండ్ల చెట్లసాగు జరగగా.. వాటికి కూడా గత ఐదేళ్లలో కష్టకాలం వచ్చింది. బాగా ఎదిగిన మామిడి, బత్తాయి చెట్లకు కూడా నీటి కరువు వచ్చింది. నీటి సదుపాయం లేకపోతే చెట్లు కాయలు కాయకపోవడమే కాదు, పచ్చని చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. కనీసం వాటి ప్రాణం కూడా నిలబడలేదు! గత ఐదేళ్లలో అలా కొన్నివందల ఎకరాల్లో పండ్ల చెట్లు కూడా నిలువునా ఎండిపోయి, మాడి మసి అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా? అనేంత స్థాయిలో సందేహాలు మొదలయ్యాయి.
అలాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆడిన డ్రామాలు అన్నీఇన్నీ కావు. అలాంటి డ్రామాల్లో పెద్దది.. రెయిన్ గన్నులు! నీళ్లే లేనిచోట. ఆ స్ప్రెయర్లను తెచ్చి చంద్రబాబు నాయుడు కరువును తనే పారద్రోలినట్టుగా ప్రచారం చేసుకోవడం అత్యంత పతనావస్థ. చంద్రబాబు నాయుడు అధికారంలోంచి దిగిపోయిన ఈ ఏడాది.. రాయలసీమలో పుష్కలమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ వర్గాలను పూర్తిగా అసహనంలోకి నెడుతూ ఉంది.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతసేపూ కరువు విలయతాండవం చేయడం ఏమిటి, ఆయన అలా దిగిపోగానే.. ఇలా భారీ వర్షాలు కురవడం ఏమిటి? చంద్రబాబు నాయుడు సీఎం హోదా నుంచి దిగిపోయిన వేళావిశేషం.. సీమలో పుష్కలమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు దేన్నైనా తట్టుకోగలరు కానీ, కరువులను తట్టుకోలేరు.
ఇలాంటి నేపథ్యంలో జగన్ సీఎం హోదాలో ఉన్న వేళ చరిత్రలో మరిచిపోయిన స్థాయి వర్షాలు పడటంతో.. ప్రజలు సంభ్రమాశ్చర్యాల్లో ఉన్నారు. చంద్రబాబు అంటే కరువే, ఆయన సీఎం హోదాలో ఉంటే కరువే.. ఆయనను దించినప్పుడే వర్షాలు.. పడతయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఈ సెంటిమెంట్ గతంలో కూడా ఉండింది. ఇప్పుడు మరింత బలపడుతూ ఉంది. ప్రజలు సెంటిమెంటల్‌గా భావిస్తున్న ఈ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీ నేతలకు నోటమాట రానీయకుండా చేస్తూ ఉంది!