సీన్ రివర్స్.. ఆర్టీసీ ప్రైవేటుకు గ్రీన్ సిగ్నల్

కంట్రోల్ మొత్తం ఇప్పుడు కేసీఆర్ చేతిలోకి వెళ్లింది. ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు హైకోర్టు కూడా మద్దతు తెలపడంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్టీసీపై పూర్తి నియంత్రణ వచ్చేసింది. ఫలితంగా ఉద్యోగుల…

కంట్రోల్ మొత్తం ఇప్పుడు కేసీఆర్ చేతిలోకి వెళ్లింది. ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు హైకోర్టు కూడా మద్దతు తెలపడంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్టీసీపై పూర్తి నియంత్రణ వచ్చేసింది. ఫలితంగా ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేటీకరిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. తెలంగాణ సర్కార్ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు.. ప్రభుత్వానికి మద్దతు తెలిపింది.

కేబినెట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని విస్పష్టంగా ప్రకటించిన ధర్మాసనం, ప్రభుత్వం కావాలనుకుంటే సగం రూట్లను ప్రైవేటుపరం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ మేరకు మోటార్ వెహికల్ చట్టం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలిపింది కోర్టు.

తాజా తీర్పుతో నియంత్రణ మొత్తం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోకి వెళ్లింది. కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై ఇప్పుడు పూర్తి నిర్ణయాధికారం ముఖ్యమంత్రిదే. అటు తనకు కావాల్సిన రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే అధికారం కూడా ప్రభుత్వానికి వచ్చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. కార్మికులు ఎవ్వరూ విధుల్లోకి వెళ్లొద్దని యూనియన్లు పిలుపునిచ్చాయి.

భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మికులు పెట్టిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. శనివారం నుంచి సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రేపు డిపోల ముందు సేవ్ ఆర్టీసీ నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.