బీజేపీ ఒక హిట్లర్.. భగ్గుమంటున్న సేన!

భారతీయ జనతా పార్టీని జర్మన్ ఒకప్పటి నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చింది శివసేన. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీతో కలిసే పోటీ చేసిన సేనకు ఇప్పుడు కమలం పార్టీ అంటే ఎందుకు…

భారతీయ జనతా పార్టీని జర్మన్ ఒకప్పటి నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చింది శివసేన. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీతో కలిసే పోటీ చేసిన సేనకు ఇప్పుడు కమలం పార్టీ అంటే ఎందుకు పడటం లేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఈ ఇరు పార్టీలూ దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నాయి. ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పార్టీలు పరస్పర విమర్శలకు దిగాయి. ఈ క్రమంలో శివసేన వాళ్లు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పీఠాన్ని సగం-సగం కాలం పంపకానికి ఇరు పార్టీలకూ ఒప్పందం కుదిరిందని సేన అంటోంది. అయితే ఇప్పుడు  బీజేపీ మాట తప్పుతోందని వ్యాఖ్యానిస్తోంది.

అయితే ఒప్పందమే  లేదని బీజేపీ అంటోంది. సీఎం పీఠం ఐదేళ్లూ తమకే అని, శివసేన బేషరతుగా తమకు మద్దతు పలకాల్సిందే  అని కమలం పార్టీ వాదిస్తోంది. ఇలా వీరి గొడవ చినికి చినికి  గాలివానగా  మారింది.

ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆదిత్య ఠాక్రే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకుని మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఎవరుండాలనేది ఉద్ధవ్ ఠాక్రేనే నిర్ణయిస్తారని శివసేన అధికారిక పత్రిక సామ్నా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్సీపీ కీలక పాత్ర పోషించబోతోందని  కూడా సామ్నా  పేర్కొనడం గమనార్హం.