జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా (కడప)లో ఏడుగురికి రాష్ట్రస్థాయి, ముగ్గురికి జిల్లాస్థాయి పదవులు దక్కాయి. వీరిలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కించుకున్న అబ్బిరెడ్డిగారి మల్లికార్జునరెడ్డిపై జిల్లాలో గమ్మత్తైన చర్చ జరుగుతోంది. దీనికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈయన వరుసకు చిన్నాన్న కావడమే.
మరొకటి ఈయన జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గ వాసి కావడం. ఈయన కమలాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కూడా. జగన్ చిన్నాన్న కావడం వల్లే మల్లికార్జునరెడ్డికి కీలక ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
గతంలో వైఎస్సార్ హయాంలో బామ్మర్ది కావడం వల్లే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కడప జెడ్పీ వైస్ చైర్మన్‌గా, కడప మేయర్ పదవులు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ మేనమామ హోదాలో కమలాపురం ఎమ్మెల్యే అయ్యారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుత నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమంత్రితో బంధుత్వమే అర్హతగా కీలక పదవిని మల్లికార్జునరెడ్డి దక్కించుకున్నారనే చర్చ నడుస్తోంది. ఇక బంధువులు కాని వారి సంగతేందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేవలం వైఎస్ కుటుంబానికి బంధువులైతే సరిపోతుందా, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ల సంగతేందనే నిలదీతలు కడప జిల్లాలో వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లాలో ప్రస్తుతం ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో మల్లికార్జునరెడ్డిని మినహాయిస్తే మిగిలిన వారికి అలంకారప్రాయమైన పదవులను కట్టబెట్టారనే విమర్శలు లేకపోలేదు. బంధువులకు పోనూ, మిగిలితే ఎవరికైనా పదవులు అనే రకంగా జిల్లాలో పరిస్థితి ఉందనే ఆరోపణలున్నాయి. ఇలాగైతే మిగిలిన వాళ్లకు పదవులు దక్కేదెప్పుడు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ప్రస్తుత నామినేటెడ్ పదవుల్లో రైల్వేకోడూరు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాలకు చోటు దక్కలేదని కడప జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. బంధువులకు కాకుండా జిల్లాలో మరొకరికి పదవి ఇచ్చి ఉంటే పార్టీపై పాజిటివ్ సంకేతాలు వెళ్లే ఉండేవనే అభిప్రాయాలు జిల్లాలో వ్యక్తమవుతున్నాయి.
కడప ఎంపీగా జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యేగా జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి, ఇక జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి చోట బంధువులకు సీఎం పెద్దపీట వేశారనే టాక్ నడుస్తోంది.
వీళ్లంతా కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతారనుకుంటే తప్పులో కాలేసినట్టే అని జిల్లా ప్రజలు అంటున్నారు. ఉదాహరణకు జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డిని తీసుకుంటే… కడపపై ఆయనకు ఎక్కడా లేని మమకారం.
కడపలో ఈయన జోక్యంపై కడప ఎమ్మెల్యే, మంత్రి అంజాద్‌బాషా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారని సమాచారం. మొత్తానికి మల్లికార్జునరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై కడప జిల్లాలో గమ్మత్తైన చర్చ సాగుతోందని చెప్పక తప్పదు.