వైసీపీకి షేమ్ షేమ్

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేన్న‌రేళ్లు అయ్యింది. ఇంకా త‌మ పార్టీ వాళ్ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దాడికి పాల్ప‌డుతోంద‌ని వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు, అలాగే అధికార పార్టీ ప‌త్రిక సాక్షి రాస్తూ వుండ‌డం దేనికి…

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేన్న‌రేళ్లు అయ్యింది. ఇంకా త‌మ పార్టీ వాళ్ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దాడికి పాల్ప‌డుతోంద‌ని వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు, అలాగే అధికార పార్టీ ప‌త్రిక సాక్షి రాస్తూ వుండ‌డం దేనికి సంకేతం? ఇది సిగ్గు ప‌డాల్సిన విష‌య‌మ‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. 

“ఊళ్లో ఉంటే టీడీపీ వాళ్లు బ‌త‌కనివ్వ‌రు…” శీర్షిక‌తో సాక్షిలో క‌థ‌నం ప్ర‌చురించారు. ఈ వార్తా క‌థ‌నం ప్ర‌చురించ‌డం వెనుక సాక్షి మీడియా, అలాగే ప్ర‌భుత్వ ఉద్దేశాలు ఏవైనా…పాఠ‌కులు, సామాన్య ప్ర‌జ‌ల్లో  కొన్ని అనుమా నాలు త‌లెత్తేలా చేసింది.

సొంత పార్టీ కుటుంబానికే ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వం, ఇక సామాన్య ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా భ‌రోసా ఇస్తుంద‌నే మౌలిక ప్ర‌శ్న‌ను రేకెత్తిస్తోంది. ప‌ల్లెల్లో బ‌తికే హ‌క్కును ప్ర‌భుత్వం కాపాడ‌లేక‌పోతున్న‌ద‌నేందుకు అధికార పార్టీ సానుభూతి ప‌రుడు గోపాల్‌ కుటుంబం ఉన్న ఊరిని వ‌దిలి వెళ్ల‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

ప్ర‌కాశం జిల్లాలోని లింగ‌స‌ముద్రం మండ‌లం మొగిలిచ‌ర్ల‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు రాసుకొచ్చారు. దిబ్బ విష‌యంలో చోటు చేసుకున్న వివాదంలో టీడీపీ నేత వేముల గోపాల‌రావు, అత‌ని అనుచ‌రుల దాడిలో వైసీపీ మ‌ద్ద‌తుదారుడు గోరంట్ల గోపాల్ బంధువు బొల్లినేని ల‌క్ష్మీకాంత‌మ్మ గాయ‌ప‌డింది. అనంత‌రం కందుకూరు ఏరియా వైద్య‌శాల‌లో చికిత్స తీసుకుని ఇంటికెళ్ల‌గా… తిరిగి బుధ‌వారం వైసీపీ సానుభూతిప‌రుడు గోపాల్ ఇంటికెళ్లి ఆయ‌న భార్య‌, అత్త ల‌క్ష్మీకాంత‌మ్మ‌పై టీడీపీ నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు.

దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద చిన్న‌పిల్ల‌ల‌తో క‌లిసి భ‌యంభ‌యంగా తల దాచుకుంటున్న ఫొటో చూస్తే… దాడికి పాల్ప‌డిన టీడీపీ నేత‌ల‌పై కాదు, ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం క‌ల‌గ‌కుండా వుండ‌దు. 

అత్య‌ధిక మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన పార్టీ అధికారంలో వుంటూ కూడా, త‌న పార్టీ సానుభూతిప‌రుల‌ను కూడా కాపాడుకోలేని ద‌య‌నీయ స్థితిలో పాల‌న సాగిస్తోంద‌ని సాక్షి చెప్ప‌ద‌ల‌చుకుందా? తాము అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, ఇంకా ప్ర‌తిప‌క్ష టీడీపీ దౌర్జ‌న్యాల‌కు బ‌లి కావాల్సి వ‌స్తోంద‌ని వైసీపీ ప్ర‌చారం చేయాల‌ని భావిస్తోందా? ఎందుకీ సానుభూతి నాట‌కాలు? ఎవ‌రి కోసం, ఎందుకోసం? ఇలాంటి ఛీప్‌ట్రిక్స్ వ‌ల్ల ప్ర‌భుత్వ‌, పార్టీ ప‌రువు మ‌రింత పోతుంది. కావున పార్టీ సానుభూతిప‌రుల‌ను కాపాడుకునే చ‌ర్య‌లు చేప‌ట్టి, అన‌వ‌స‌ర ప్ర‌చారాన్ని మానేస్తే మంచిది.