ఈ ఒక్క విషయంలో లోకేష్ ను మెచ్చుకోవాల్సిందే!

జయము జయము చంద్రన్నా… అంటూ పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరిగిన భజనా కాలక్షేపం అందరికీ గుర్తుండే ఉంటుంది. సోమవారం-పోలవరం అంటూ అప్పట్లో అలా భజనలు చేయించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అదే పోలవరం కేంద్రంగా రాజకీయాలకు…

జయము జయము చంద్రన్నా… అంటూ పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరిగిన భజనా కాలక్షేపం అందరికీ గుర్తుండే ఉంటుంది. సోమవారం-పోలవరం అంటూ అప్పట్లో అలా భజనలు చేయించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అదే పోలవరం కేంద్రంగా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మరీ ముఖ్యంగా ముంపు ప్రాంతాల పర్యటనకు కొడుకును పంపిస్తున్నారు.

కమీషన్ల కక్కుర్తితో ఎర్త్ డ్యాం, కాఫర్ డ్యాం అంటూ పరుగులు పెట్టిన బాబు.. తన హయాంలో ముంపు ప్రాంత వాసుల పునరావాసాన్ని అస్సలు పట్టించుకోలేదు. అలాంటి బాబుకి, ఆయన కొడుకు లోకేష్ కి పోలవరం ముంపు మండలాల్లో పర్యటించే హక్కు ఉందా..?

తప్పంతా తమ హయాంలో జరిగితే, చివరకు దాని పర్యవసానాలను వైసీపీపైకి నెట్టేయడానికి పూనుకున్నారు చంద్రబాబు, లోకేష్. తమ హయాంలో చేసిన అప్పులకు, దాని వల్ల పెరిగిపోయిన తిప్పలకు ఇప్పుడు వైసీపీని ఇరుకున పెడుతున్నట్టే.. పోలవరం ముంపు ప్రాంతాల అంశాన్ని కూడా జగన్ కు ఆపాదించడానికి స్కెచ్ రెడీ అయిపోయింది. అమలు కూడా జరిగిపోతోంది.

పోలవరం ముంపు మండలాల్లో లోకేష్ పర్యటన మొదలైంది. తాము అధికారంలో ఉండగా పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి చేతులు రాని లోకేష్.. ఇప్పుడు అవే చేతులతో బాధితుల కన్నీరు తుడుస్తారట. నవ్విపోదురు గాక, మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది లోకేష్ వ్యవహారశైలి.

కేంద్రం తన పరిధిలోకి తీసుకుని పోలవరాన్ని నిర్మిస్తామని చెప్పినా కూడా కమీషన్ల కక్కుర్తితో దాన్ని రాష్ట్రం అధీనంలోకి తీసుకున్నారు బాబు. పోనీ పని ఏమయినా జరిగిందా అంటే అదీ లేదు. కాఫర్ డ్యామ్ అనే ఓ మట్టి కట్టని కట్టి, నీరు నిలువచేయగలిగారంతే. పోలవరం యాత్రల పేరుతో జనాలందర్నీ డ్యామ్ వద్దకు తీసుకెళ్లి అదో పెద్ద ప్రహసనంగా మార్చారు.

అదే సమయంలో చంద్రబాబు పునరావాసం గురించి పట్టించుకుని ఉంటే, ఇప్పుడు గోదావరి వరదల వల్ల ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది కాదు. కానీ అప్పుడు పునరావాస ప్యాకేజీని బాబు పూర్తిగా గాలికొదిలేశారు. అదే బాబు ఇప్పుడు రాజకీయం కోసం పోలవరం ముంపు గ్రామాల్లో కొడుకుని పరామర్శ యాత్ర కోసం పంపించారు.

పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే ఏమౌతుందో లోకేష్ కు బాగా తెలుసు. అందుకే ముందే టీడీపీ నేతలు, అనుకూల మీడియా పక్కాగా ఏర్పాట్లు చేసింది. చుట్టూ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టింది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమ సారధ్యం/అధ్యక్షత వహించారు. ఇంకేముంది.. పది మందిని పోగేసుకుని జగన్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే కార్యక్రమం దిగ్విజయంగా మొదలైపోయింది. దానికి బాబు మీడియా ప్రచారం కూడా అంతే బ్రహ్మాండంగా మొదలైంది.

ముంపు గ్రామాల ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసినవారే, ఇప్పుడు వారిని పరామర్శించేందుకు వస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కానీ ఒక్క విషయంలో మాత్రం లోకేష్ ను మెచ్చుకోవాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పునరావాసం ప్యాకేజీపై మాట్లాడని లోకేష్.. ఇప్పుడు సిగ్గులేకుండా ఇలా ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్నారు.