బలమైన రాజకీయ నాయకులైనా, బలహీన నాయకులైనా తమను తాము గొప్పగా ఊహించుకుంటూ గొప్పలు చెబుతుంటారు. బలమైన రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకున్నా అర్ధం చేసుకోవచ్చు. కానీ జనాదరణ లేని నాయకులు గొప్పలు చెప్పుకుంటేనే నవ్వొస్తుంది. ఈ రోజుల్లో నాయకులంతా సినిమా డైలాగులు చెబుతున్నారు.
సినిమాల్లోని పంచ్ డైలాగులు విసురుతున్నారు. ఈ డైలాగులకు జనం చప్పట్లు కొడతారు. కొద్దిసేపు సంతోషిస్తారు. కానీ వాస్తవంలో పరిస్థితి అలా ఉండదు. రాజకీయాలు చేయడమంటే సినిమా డైలాగులు చెప్పినంత సులభం కాదు. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ఈ సంగతి గ్రహించడం లేదు.
తండ్రి ఇమేజ్ ను, ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను నమ్ముకొని రాజకీయాల్లోకి దిగిన షర్మిల తనకు జనాదరణ లేదనే విషయం గ్రహించడం లేదు. తనను తాను గొప్పగా ఊహించుకోవడం చూస్తుంటే నవ్వొస్తోంది.
కానీ ఆమె ధైర్యాన్ని, తెగింపును మెచ్చుకోవాలి. ఫలితం ఎలా ఉంటుందనే దానితో నిమిత్తం లేకుండా ఆమె తన పని తాను చేసుకుపోతోంది. అధైర్య పడుతున్న పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. తండ్రి ఇమేజ్ ను నమ్ముకుంది. అంతే. పాదయాత్ర చేస్తున్న షర్మిల సింహం సింగల్ గానే వస్తుందని చెప్పింది.
ఇది సినిమా డైలాగు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇక భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని అప్పుడే డిక్లర్ చేసింది. తాను చాలా బలవంతురాలినని ఆమె ఉద్దేశం కావొచ్చు. కొమ్ములు తిరిగిన పార్టీల అధినేతలే, రాజకీయాల్లో ముదిరిపోయిన పార్టీలే అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నాయి. సిద్ధాంతాలన్నీ పక్కన పెడుతున్నాయి.
వాళ్ళతో, ఆ పార్టీలతో పోలిస్తే షర్మిల ఎంత?
సుమారు 400 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 4 వేల కిలోమీటర్లు చుట్టేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్ర సాగుతుంది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సరైన గుర్తింపే లేదు. దాన్ని ఓ రాజకీయ పార్టీగా కూడా ఎవరూ చూడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు లేరు. వైఎస్ మీద అభిమానం ఉన్న వాళ్లు షర్మిలకు తోడుగా ఉన్నారు. కానీ వాళ్ల సంఖ్య తక్కువే. ఇక మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే రాష్ట్ర ప్రజల ఫోకస్ ఉంది. అక్కడి ఉప ఎన్నిక రాష్ట్రమంతా రాజకీయ వేడిని రగిల్చింది.
ఈ నేపథ్యంలో అక్కడ పోటీ నుంచి పోటీ చేయని షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజల ఏ మేరకు హాజరవుతారన్నది ప్రశ్నార్థకమే. ఆమె పాదయాత్ర విజయవంతం అవుతుందని కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. షర్మిల పార్టీ నిలదొక్కుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాస్తో కూస్తో క్యాడర్ బలం ఉన్న బండి సంజయ్ పాదయాత్రే భారీ స్థాయిలో విజయవంతం కాలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పాదయాత్ర కారణంగా షర్మిలకు జరిగే ప్రయోజనం ఏమిటంటే ప్రతి రోజూ వార్తల్లో ఉంటుంది. కానీ ఆమెకు మీడియా సపోర్ట్ కూడా తక్కువగానే ఉంది.