తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు చాపకింద నీరులా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న వైఎస్ షర్మిల …కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించడంతో పాటు ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించిన షర్మిల …పట్టుదలతో ముందుకెళుతున్నారు.
ఇటీవల ఆమె తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతర కార్యక్రమాల్లో భాగంగా జిల్లాల్లో పార్టీ సానుభూతిపరులు, ఫాలోయర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టాల్సి ఉంది.
అయితే తన చుట్టూ ఉన్న వాళ్లు కరోనా బారిన పడడంతో పాటు తెలంగాణలో మహమ్మారి విలయతాండవం సృష్టిస్తూ ప్రమాద ఘంటి కలు మోగిస్తుండడంతో వైఎస్ షర్మిల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో షర్మిల తన తరపున చేపట్టనున్న దీక్షల ఉద్దేశాన్ని తెలిపారు. ఆరేళ్లుగా తెలంగాణలో ఉద్యోగాల నియామకంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకుంటోందని వాపోయారు.
నిరుద్యోగుల బాధలకు చలించి, జీవితంపై వారికి భరోసా కలిగించేందుకే ఉద్యోగ సాధన దీక్ష చేపట్టినట్టు షర్మిల స్పష్టం చేశారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. అయితే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగానే కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగిస్తామని షర్మిల స్పష్టం చేయడం విశేషం.