విశాఖలో వెలసిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కరోనా నీడన సాగింది. స్వామి వారికి ఈసారి పూర్తిగా ఏకాంతంగానే పూజారులు అర్చనలు చేశారు. తొలి దర్శన భాగ్యం ఆలయ్య వంశపారంపర్య ధర్మకర్త, చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుకు దక్కింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి అవంతి శ్రీనివాస్ స్వామికి సమర్పించారు. ఏడాది పొడవునా చందనంతో ఉండే అప్పన్నస్వామి ఈ రోజున నిజ రూప దర్శనతో భక్తులకు కటాక్షిస్తారు.
ప్రతీ ఏటా ఒడిషా తో పాటు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చందనోత్సవం వేళ స్వామిని నిజ రూపాన్ని దర్శించుకుని పులకించి పోతారు.
అటువంటి మహదావకాశం గత రెండేళ్ళుగా అప్పన్న భక్తులకు కరోనా మహమ్మారి లేకుండా చేసింది. వచ్చే ఏడాది అయినా స్వామికి భక్తులకు మధ్య ఏ ఏటంకాలు,అడ్డూ ఉండరాదని ఆస్తికజనులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఆలయ మాజీ చైర్ పర్సన్ అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తొలి దర్శనానికి పిలవకుండా ప్రభుత్వం అవమానించిదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే కరోనా వేళ ఎవరికీ దర్శనానికి అనుమతులు లేవని ఆలయ అధికారులు చెబుతున్నా దీన్ని రాజకీయం చేయడమేంటని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.