శేఖర్ గుప్తా – అమరావతి వ్యాసం -పెయిడ్ ఆర్టికల్ మాదిరి ఉందా?

జర్నలిస్టులు అంటే ఉన్నవి ఉన్నట్లు, లేనివి లేనట్లు చెప్పేవారని చాలా మంది నమ్ముతారు. అందులోను జాతీయ స్థాయిలో ఉండే జర్నలిస్టులు ఈ విలువలను పాటించవలసిన అవసరం చాలా ఉంది. వారే దిగజారిపోయి పెయిడ్ ఆర్టికల్స్…

జర్నలిస్టులు అంటే ఉన్నవి ఉన్నట్లు, లేనివి లేనట్లు చెప్పేవారని చాలా మంది నమ్ముతారు. అందులోను జాతీయ స్థాయిలో ఉండే జర్నలిస్టులు ఈ విలువలను పాటించవలసిన అవసరం చాలా ఉంది. వారే దిగజారిపోయి పెయిడ్ ఆర్టికల్స్ మాదిరి వ్యాసాలు రాస్తే వారిని ఎలా గౌరవించాలి. శేఖర్ గుప్తా అనే ప్రముఖ జర్నలిస్టు ఆయా పత్రికలలో పనిచేశారు. పలువురితో సంబంధాలు ఉండే వ్యక్తి అయి ఉండవచ్చు. కాని ఎవరో రాజకీయ నాయకుడు రాసిచ్చిన వ్యాసం పై సంకతం చేసి తనదే అని క్లెయిమ్ చేసుకున్నట్లుగా, లేదా వీడియోలో అదంతా చదివినట్లుగా ఉంటే ఏమని అంటాం? అమరావతి రాజధానిని యధావిధిగా కొనసాగించాలని శేఖర్ గుప్త కోరితే తప్పు కాదు. అందుకు అనువైన వాదన చెప్పడం ఆక్షేపణీయం కాదు. 

కాని తెలుగుదేశం పార్టీ ఏమి చెబుతుందో అది మాత్రమే ఆయన కూడా చెబితేనో, రాస్తేనో ఆయనను ఏమనుకోవాలి? ఆయన రాసిన వ్యాసాన్ని తెలుగుదేశం పత్రికలులుగా, టీవీలుగా ముద్ర పడ్డ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పదే, పదే ప్రచారం చేస్తున్నాయంటే దాని అర్థం ఏమిటి?వారు ఎలా రాయమంటే అలా రాసి ఉండాలి? వారు ఏమి చెప్పమంటే అది చెప్పి ఉండాలి. ఆయనకు స్థానిక పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేదన్న సంగతి ఆ వ్యాసం చదివినవారికి అర్దం అవుతుంది. రైతులు ముప్పైమూడువేల ఎకరాలు ఇచ్చారని ఆయన అన్నారు.అదంతా రాజధానిగా వాడుకోవచ్చని ఆయన భ్రమ పడుతున్నారు.అందులో మూడో వంతు తిరిగి రైతులు ఇవ్వాలన్న సంగతి ఆయన మర్చిపోయారు. వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి ఎంత వ్యయం అవుతుందో తెలియని అజ్ఞానంలో ఉన్నారని అనుకోవాలి. 

రెండేళ్ల క్రితం టిడిపి ప్రభుత్వం అంచనా ప్రకారమే లక్ష తొమ్మిది వేల కోట్లు కావాలి. మరి అంత మొత్తం ఎక్కడ నుంచి ఎన్నేళ్లలో ఖర్చు చేయాలో కూడా గుప్తా చెప్పాలి కదా.. ఇదేమీ చిల్లరకొట్టులో పద్దులు రాయడం కాదు.. వ్యాసారలు రాయడం అంటే.. అంతేకాదు.. ఈ ప్రభుత్వం బడ్జెట్ లో 500 కోట్లు పెట్టిందని అంటున్నారు. 

అంతకుముందు టిడిపి ప్రభుత్వం 277కోట్లే పెట్టిందని ఆయనకు తెలియకపోతే తప్పు మనది అవుతుందా? కేంద్రం ఇచ్చిన 1500 కోట్లో, 2500 కోట్లతో కేవలం తాత్కాలిక భవనాలను కట్టిన టిడిపిని ఆయన ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు టిడిపి నేతలు ఇన్ సైడ్ ట్రేడింగుకు పాల్పడి దానిని ఒక కుంభకోణంగా మార్చారో ఆయన తెలియకపోతే మనం ఏమి చేయాలి? సింగపూర్ ఒప్పందంలో వారు 300  కోట్లు పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం 5500 కోట్లు ఖర్చు చేసి, వాటా మాత్రం 42 శాతం గానే ఒప్పుకోవడాన్ని సమర్థిస్తారా? సింగపూర్ కంపెనీ ప్లాట్ల బిజినెస్ చేస్తే అది అభివృద్ధి అవుతుందా? ఆ మాత్రం వ్యాపారాలు చేసేవాళ్లు ఇక్కడ లేరా? 

నిజంగానే సింగపూర్ కంపెనీలు చంద్రబాబు టైమ్ లో నిర్మాణాలు ఎందుకు చేయేలేదు? అసలు సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తుందని ప్రచారం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ఇండియా కంపెనీలతో నిర్మాణాలు చేపట్టే యత్నం చేశారు? పైగా ఒకే చోట తొమ్మిది నగరాల పేరుతో నిర్మాణాలు చేస్తే మరి మిగిలిన రాష్ట్రం అంతా ఏమైపోవాలి? అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం లేదని శేఖర్ గుప్త బావిస్తున్నారా? విశాఖలో లూలూ కంపెనీకి టిడిపి ప్రభుత్వం భూమి ఎప్పుడు ఎలా ఇచ్చింది. 

అయినా ఆ సంస్థ ఇంతకాలం ఎందుకు ముందుకు వెళ్లలేదు? దానికి కూడా జగన్ ప్రభుత్వమే కారణమా? చంద్రబాబు రాజధానిని ఒక గుదిబండగా మార్చింది వాస్తవం కాదా? ఆ గుదిబండను జగన్ కూడా మోయాలని శేఖర్ గుప్త చెబుతున్నారంటే ఆయన ఎంత తెలివైనవారో అర్దం చేసుకోవచ్చు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ప్రాంతాల మద్య సమతుల్యత కోసం రాజధాని ఒక చోట, హైకోర్టు మరోచోట పెట్టాలన్న సంగతి శేఖర్ గుప్తకు తెలియకపోతే మనం బాధ్యత వహించాలా? రాజధాని పేరుతో భూముల సేకరణకు రైతుల పంటలను ప్రభుత్వాలే తగులపెట్టించడం మాత్రం శేఖర్ గుప్తకు జాతీయ విషాదం కాదు.. మూడు పంటలు పండే భూములను చంద్రబాబు బీడు భూములుగా మార్చడం జాతీయ విషాదం కాదా. 

ఏ జర్నలిస్టు అయినా హేతుబద్ద వాదన చేస్తే దానిని అభినందింవచ్చు. మనం ఆ వాదనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా! ఇంత సోది రాసిన శేఖర్ గుప్తకు జగన్ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలన్న కనీస లక్షణాన్ని ఎందుకు పాటించలేదు? ఆయన జర్నలిస్టు మిత్రుడు ఒకరు ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. ఆయనతో కలిసి శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుని ఉపన్యాసం ఇచ్చి సన్మానం చేసుకున్నారుకదా.. ఈ వ్యాసం ఆయన రాసిందే అయి ఉంటే.. ఆ సలహాదారుడిని వివరాలు అడిగి ఉండవచ్చు కదా.. ఇవేవి చేయలేదంటే శేఖర్ గుప్తా కేవలం టిడిపి వారికి రాజకీయంగా ప్రయోజనం కలిగించే లక్ష్యంతోనే రాశారన్న భావన కలిగితే తప్పేముంది. రామోజీ వంటి వారు ఏమి రాయమంటే రాశారనో, లేక వారు రాసినదానిని చదివారన్న అభిప్రాయం కలిగితే తప్పేముంది?

ఏపీకి ప్రత్యేక హోదా అంశం విషయంలో కాని, ఇతరత్ర విభజన హామీల విషయంలో కాని, విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రలో ఆందోళనలు వచ్చినప్పుడు కాని శేఖర్ గుప్తా వంటి వారికి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు చాలా విషాదం కనిపిస్తుంది. ఎందుకంటే వారు జర్నలిజం విలువలను వదిలేశారు కనుక. అందుకే అచ్చం పెయిడ్ ఆర్టికల్స్ మాదిరి శేఖర్ గుప్తా వ్యాసరం రాశారన్న భావన కలుగుతుంది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. అయినా చివరిగా ఒక్క మాట. శేఖర్ గుప్తాకు నిజంగా వాస్తవాలు తెలుసుకుని రాజధాని అమరావతిలో ఉండాలని ఆయన భావిస్తే తప్పు కాదు.. కాని తుగ్లక్ అని, మరొకటని పిచ్చి రాతలు రాయడం తగదని చెప్పకతప్పదు. రెండో వాదన లేకుండా ఇలాంటి చెత్త ఇకనైనా రాయకుండా ఉంటే మంచిది.

కొమ్మినేని శ్రీనివాసరావు