మరో నాలుగు రోజులు మాత్రమే గడువు అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆ లోపు శివసేన తాము చెప్పినట్టుగా నడుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకుంటోంది శివసేన. ''అంటే రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారని చెప్పదలుచుకున్నారా?'' అనేది శివసేన సంధిస్తున్న ప్రశ్న.
ఈ ప్రశ్నకు కమలనాథులు నోరు విప్పలేకపోతున్నారు.
శివసేనను బెదిరించడానికి రాష్ట్రపతి పేరును కూడా వాడేసుకున్నారు కమలనాథులు. ఈ నేపథ్యంలో సేన కూడా ఘాటుగా స్పందించింది. ఇప్పటికే తమకు ప్రత్యామ్నాయ మార్గం ఉందని శివసేన ప్రకటించింది.
కాంగ్రెస్-ఎన్సీపీలతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆ పార్టీకి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేశారట. పవార్ వెళ్లి సోనియాను కలుస్తున్నారట. ఈ నేఫథ్యంలో రాజకీయం ఆసక్తిదాయకంగా మారింది.
కాంగ్రెస్-ఎన్సీపీ-సేనలు కలిసి ప్రభుత్వాన్నినిజంగా ఏర్పాటు చేస్తే బీజేపీ చూస్తూ ఉంటుందా? అనేదీ ఆసక్తిదాయకమైన విషయం. తమను బీజేపీ బెదరించలేదని, ఠాక్రేల బంధువులు ఎవరూ జైళ్లలో లేరని శివసేన బీజేపీని దెప్పి పొడుస్తూ ఉంది. అయితే ఉద్దవ్ ఠాక్రేకు సీఎం పదవి ఇస్తే తప్పేం లేదంటూ బీజేపీ సన్నిహితుడు రాందాస్ అథవాలే వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ మెత్తబడుతున్నదానికి ఇది రుజువా?