విశాఖలోని సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ మొదటి యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని ఈ రోజు నుంచి సడెన్ గా నిలుపు చేశారు. అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో లేకపోవడంతో పాటు, బొగ్గు సరఫరా గత రెండు రోజుల నుంచి తగ్గడంతో ముందు జాగ్రత్తగా తొలి యూనిట్ ని మూసివేశారు.
సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కి అవసరం అయ్యే బొగ్గు ప్రతీ రోజూ మధ్య ప్రదేశ్ లోని తాల్చేర్ కోల్ మైన్ ఫీల్డ్ నుంచి 12 ర్యాకుల వరకూ బొగ్గు రైలు మార్గం ద్వారా వస్తుంది. అయితే బొగ్గు సంక్షోభం నేపధ్యంలో కేవలం ఏడు ర్యాకులు మాత్రమే వస్తున్నాయి.
ఇప్పటిదాకా రోజుకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల వరకూ సింహాద్రి థర్మల్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు ఉండేవి. ఇపుడు అవి కాస్తా 7 వేల క్యూబిక్ మీటర్లకు పడిపోయాయి.
దాంతో అధికారులు యాక్షన్ లోకి దిగి తొలి ప్లాంట్ లోని విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇక సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ తొలి యూనిట్ లో రోజుకు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
నాలుగు యూనిట్లుగా ఈ ప్లాంట్ ని విస్తరించారు. టోటల్ గా నాలుగు యూనిట్ల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక తొలిదశలో రెండు యూనిట్ల నుంచి వచ్చే వేయి మెగా వాట్ల విద్యుత్తుని పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలకు అందిస్తారు.
ఇందులో నుంచి సగానికి సగం అంటే అయిదు వందల మెగావాట్ల విద్యుత్ కి ఇపుడు లోటు ఏర్పడింది. ఖమ్మం-విజయవాడలో నున్న లైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు సింహాద్రి తొలి ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. మొత్తానికి చూసుకుంటే చీకటి రోజులు ముంగిటకు వచ్చేసినట్లే అంటున్నారు.