భారతీయులకు స్మార్ట్ ఫోన్లపై మోజు ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో రకరకాల విలాస వస్తువుల విషయంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుముఖం పడుతూ ఉందని వివిధ అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కార్ల కొనుగోలు అయితే మూడో వంతుకు పడిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. దేశంలో మాంద్యం పరిస్థితుల వల్ల ప్రజల కొనుగోలు శక్తి అలా తగ్గుముఖం పట్టిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. కార్ల కొనుగోలు మూడో వంతుకు పడిపోవడానికి కారణం.. ఓలా, ఊబర్లే కారణమని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విస్మయకరంగా మారింది.
ఆ సంగతలా ఉంటే.. స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో మాత్రం ఇండియా దూసుకుపోతూ ఉంది. ఇండియాలో పేద, మధ్యతరగతులకు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తప్పని సరిగా మారింది. టీవీల తర్వాత భారతీయులును అత్యధిక స్థాయిలో కట్టిపడేసింది స్మార్ట్ ఫోన్లే అని స్పష్టం అవుతూనే ఉంది. టీవీ ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా మారి దశాబ్దం గడిచిపోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వంతు వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో ఇండియా అమెరికాను మించిపోవడం గమనార్హం.
స్మార్ట్ ఫోన్ అమ్మకాలకు ప్రపంచంలో రెండో అతి పెద్ద మార్కెట్ గా నిలుస్తోంది ఇండియా. ఇది వరకూ రెండో పెద్ద మార్కెట్ గా అమెరికా ఉండేది. ఇప్పుడు ఇండియా ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2019లో ఇండియాలో దాదాపు 16 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదట! ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లకు పెద్ద మార్కెట్ గా ఉంది చైనా. ఆ దేశం తర్వాత ఇండియాలోనే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సాగాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనే అంచనాల మధ్య కూడా ఇండియన్స్ స్మార్ట్ ఫోన్ల విషయంలో అస్సలు రాజీ పడుతున్నట్టుగా లేరు!