ఈ ఏడాది క్యూ2 లో ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు భారీ దెబ్బ పడిందనిన అంచనా వేస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థలు. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఉన్న ఫలంగా 50 శాతం పడిపోయిందని అవి లెక్క గడుతున్నాయి. కరోనా-లాక్ డౌన్ వల్ల ఈ పతనం చోటు చేసుకుందని అవి విశ్లేషిస్తున్నాయి.
నంబర్ల ప్రకారం చూస్తే.. 2019 సంవత్సరం ఏప్రిల్-జూన్ ల మధ్యన ఇండియాలో దాదాపు 33 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ ల మధ్యన కేవలం 17.3 మిలియన్ స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం. అంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్ సగానికి సగం ఆవిరయ్యింది. దీనికి ప్రధాన కారణం.. కరోనా వ్యాప్తి- లాక్ డౌన్ లే అని వేరే చెప్పనక్కర్లేదు.
చాలా వరకూ సెల్ ఫోన్ స్టోర్స్ మూత పడ్డాయి. లాక్ డౌన్ మినహాయింపులు ఉన్నప్పటికీ ప్రజలు పొలోమని వెళ్లి ఫోన్లు కొనే పరిస్థితి లేదు. దానికి ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. లాక్ డౌన్ పరిణామాల్లో దేశంలో చిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి ఉద్యోగం ఉందో, ఎవరి ఉద్యోగం లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ల ఆదాయాలు తగ్గిపోవడంతో.. సహజంగానే చాలా మంది కొత్త ఫోన్లను కొనే ఉత్సాహాన్ని చూపరు. దేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు అంతలా తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం.
అలాగే కొనాలనే ఆసక్తి ఉన్నా.. లాక్ డౌన్ పరిణామాల వల్ల కొంతమంది వెనుకడుగు వేస్తూ ఉండవచ్చు. ఈ సమయంలో పార్సిల్స్ తెప్పించుకునే రిస్క్ ఎందుకని కొందరు ఆగిపోతూ ఉండవచ్చు.
ఇక ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు దెబ్బపడటానికి మరో కారణం..ఇండో చైనా పరిణామాలు కూడా అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండియాలో చైనా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. చైనా వస్తు బహిష్కరణ కొంత మేరకు అయినా సాగుతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చైనా కంపెనీలే ఇండియాలో రారాజులు అనే విషయం ప్రజలకు కూడా అర్థం అవుతోంది. షావ్మీ, వివోలు 50 శాతం మించిన మార్కెట్ ను క్యాప్చర్ చేస్తున్నాయి. వాటిపై వ్యతిరేకతతో కూడా కొంతమంది కొత్త ఫోన్ల జోలికి వెళ్లకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇండియాలో ఉన్నట్టుండి 50 శాతం అమ్మకాలు హరించుకుకపోవడం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు దెబ్బేనని చెప్పక తప్పదు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యలో కూడా 30 మిలియన్లకు మించి స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయట. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత మాత్రం సగం మార్కెట్ మిగిలినట్టుగా ఉంది. తాము సృష్టించిన వైరస్ తో చైనా కంపెనీలకు కూడా బాగానే దెబ్బ పడుతున్నట్టుగా ఉంది.