కేసులు, ఆరోపణలు, అకారణంగా కేసులు పెట్టడాలు, జైల్లో .. రిమాండ్ లో ఉంచడాల గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్లు స్పందిస్తే భలే ఫన్నీగా ఉంటుంది. తమ వ్యతిరేకులు అలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు వెటకారపు మాటలు మాట్లాడటం, తమ వాళ్లు చిక్కుకుంటే అయ్యోపాపం అన్నట్టుగా ఉంది ఈ నేతగారి తీరు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈఎస్ఐ స్కామ్ లో పోలిసుల అదుపులో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. అచ్చెన్నను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని, పది లక్షల రూపాయల అవినీతిని కూడా నిరూపించలేకపోయారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏకంగా 150 కోట్ల రూపాయల అవినీతి స్కామ్ లో అచ్చెన్న ముందుగా అరెస్టు కావడం తెలిసిన సంగతే. ఆ తర్వాత ఆయన ప్రభుత్వాసుపత్రికి చేరారు. అక్కడ చికిత్స చేసి, వైద్యులు డిశ్చార్జి చేయగా.. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు!
ఆయన పేరుకు అరెస్టు అయినా.. ఆసుపత్రికి చేరి సేదతీరుతున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఆయన విషయంలో స్పందించడం ఆపేశారు. మొదట్లో అచ్చెన్న కుటుంబీకులను పరామర్శించి ఉత్తరాంధ్ర రుచులు చూసి వచ్చిన నారా లోకేష్ ఆ తర్వాత కామ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు కూడా అచ్చెన్నాయుడి విషయంలో స్పందించడం లేదు.
ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఉచిత సానుభూతి వర్షం కురిపించారు. పది లక్షల రూపాయల అవినీతిని కూడా నిరూపించలేకపోయారట. ఆకారణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారట! రిమాండ్ లో ఉండటం బాధాకరమట! మరి ఇదే బాధాకరం అయితే.. ఇప్పటికీ రుజువు కాని కేసుల్లో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఇదే సోమిరెడ్డి ఏం మాట్లాడారు?
అచ్చెన్న విషయంలో తెగ బాధపడుతున్నారట ఈయనగారు. మరి జగన్ అరెస్టప్పుడు ఎలా ఫీలయ్యారో! అయినా అప్పుడే బాధపడితే ఎలా సోమిరెడ్డిగారూ.. మాజీ మంత్రి హోదాలో 150 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కున్నారు అచ్చెన్నాయుడు. దీనిలోని అసలు వ్యక్తుల పాత్రలను ఆయన బయట పెడితే కథ మరింత రసవత్తరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అదే జరిగితే నారా దేవాన్ష్ కూడా కాబోయే సీఎం అని కీర్తించిన సోమిరెడ్డి లాంటి వాళ్లకు మరెంత బాధ కలుగుతుందో!