టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవితో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముందే మూడు రాజధానుల వ్యవహారంతో ఏపీ రాజకీయాలు గరంగరంగా ఉన్నాయి. ఇప్పుడు చిరుతో సోము వీర్రాజు భేటీ ఆ వేడికి తోడైంది. తన మిత్రపక్షమైన జనసేనాని అధ్యక్షుడు, మెగాస్టార్ తమ్ముడైన పవన్‌కల్యాణ్‌నే ఇంత వరకు సోము వీర్రాజు కలవలేదు. నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికైన తర్వాత పవన్‌కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అంతే తప్ప మిత్ర పక్ష పార్టీల నేతలు పరస్పరం కలుసుకున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో కేంద్రమాజీ మంత్రి చిరంజీని ఎవరూ ఊహించని విధంగా ఆయన ఇంటికి వెళ్లి కలుసుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ….సినిమాల్లో బిజీ అయ్యారు. మరోవైపు టాలీవుడ్‌లో ఎలాంటి సమ స్యలు ఉత్పన్నమైనా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు, పరిశ్రమ సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చిరంజీవి నేతృత్వంలో కొందరు సినీ పెద్దలు కలుసుకున్న విషయం తెలిసిందే.
ఇదే సందర్భంలో చిరంజీవి అండ్ టీంపై మరో అగ్రనటుడు, చంద్రబాబు బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర విమ ర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకు కౌంటర్‌గా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా చిత్రపరిశ్రమలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్న చిరంజీవి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుందనే మాట వినిపిస్తోంది.
మొదటి నుంచి చిరంజీవికి చంద్రబాబు అంటే అసలు గిట్టదు. 2009లో తమ అధికారానికి సైంధవుడిలా చిరంజీవి అడ్డుకు న్నారనే ఆవేదన చంద్రబాబులో ఉంది. పలు సందర్భాల్లో బాబు తన మనసులో మాటను వెళ్లగక్కారు కూడా. సోము వీర్రాజుకు కూడా చంద్రబాబు అంటే అసలు పడదు. బాబు మాట ఎత్తితే ఒంటికాలిపై లేస్తున్నారాయన. ఈ నేపథ్యంలో చిరంజీవి, సోము వీర్రాజు కలయిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది.
తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ చిరంజీవి కలవడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే టాక్ వినిపి స్తోంది. 2024 టార్గెట్‌గా బీజేపీ -జనసేన పనిచేస్తాయని సోము వీర్రాజు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గంలో సంపూర్ణస్థాయిలో పట్టు సాధించేందుకు చిరంజీవితో కలయిక ద్వారా ఒక సంకేతాన్ని పంపేందుకు సోము వీర్రాజు ఎత్తుగడ వేశారని బీజేపీ-జనసేన శ్రేణులు చెబుతున్న మాట.
ఏపీలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. కానీ వైసీపీ, టీడీపీల వైపు కాపు సామాజిక వర్గం రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారానికి చేరువ కావాలంటే ముందుగా సామాజిక వర్గాన్నంతా ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో సోము వీర్రాజు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవితో భేటీ కావడాన్ని అర్థం చేసుకో వాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాదేది కవితకు అనర్హమన్నట్టు…కాదేది రాజకీయానికి అనర్హమని చెప్పుకోవాలి. సోము వీర్రాజు ప్రయత్నాలు ఏ మాత్రం ఫలిస్తాయో భవిష్యత్ కాలమే చెప్పాలి.