సోనూ సూద్.. కరోనా/లాక్ డౌన్ సమయంలో అందరికీ సాయం చేస్తూ ముందుకు వెళ్ళారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా నిజజీవితంలో మాత్రం హీరోగా మారారు. అలాంటి సోనూ సూద్ ఇప్పుడు రాజకీయ నేతల చేత పూర్తి స్థాయిలో బురద చల్లించుకోడానికి రెడీ అయ్యారు.
నిన్నటి వరకూ ఆయన అందరి వాడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో చిలకగా మారారు. తన సోదరి కోసం సోనూసూద్ ఈ సాహసం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోను సోదరి మాళవిక బరిలో దిగబోతున్నారు. దీంతో సోనూకు ప్రచారం చేయక తప్పడం లేదు. అయితే ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నిన్నమొన్నటి వరకూ ఆమె స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతుందని అందరూ భావించారు. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యాక మాత్రం సోనూ సూద్ ని కాంగ్రెస్ తమవైపు తిప్పుకుంది.
ప్రస్తుతానికి సోనూ సూద్ తన సోదరి కోసం మాత్రమే ప్రచార బరిలో దిగుతానని చెబుతున్నా.. ఆయన్ను పూర్తి స్థాయిలో ప్రచార బరిలో దింపేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సోనూని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా మార్చేయాలని చూస్తోంది. ఆయన్ను ఊరూరా తిప్పేందుకు షెడ్యూల్ కూడా రెడీ చేసింది.
విమర్శను కాచుకోగలరా..?
గతంలో ఢిల్లీ ప్రభుత్వం తరపున ఓ విద్యా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు సోనూ సూద్. ఆ తర్వాత సోనూ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఆప్ నేతలతో కలిసినందుకే కేంద్రం ఇలా కక్ష తీర్చుకుందని అన్నారంతా. ఎంక్వయిరీల పేరుతో వేధించిందని అన్నారు. దీంతో సోనూసూద్ కొంత మనస్థాపానికి కూడా గురయ్యారు.
ఇటీవల సోనూ సోదరి రాజకీయ అరంగేట్రంతో.. ఇన్నాళ్లూ పంజాబ్ స్టేట్ ఐకాన్ గా ఉన్న సోనూ సూద్.. ఆ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్తే ఇవన్నీ సహజం. మరి ఇలాంటివాటన్నిటినీ ఎదుర్కోడానికి సోనూ సూద్ ఎంతమాత్రం సిద్ధంగా ఉన్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
తెలివైన సోనూ..
సోను సోదరి మాళవిక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ కండువా కప్పుకోలేదు. కేవలం మద్దతు మాత్రమే ఇస్తానని.. తాను పార్టీలో చేరలేదని సోనూసూద్ చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆయన్ని వదిలిపెడుతుందా అనేది చూడాలి.
చూస్తుంటే సోనూసూద్ రాజకీయాల వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లోకి సోను రాకపోయినా.. ఆ తర్వాత కచ్చితంగా రావాల్సిన పరిస్థితి. ఇక బీజేపీ నేతలు కూడా సోనూసూద్ ను టార్గెట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడీ పంజాబ్ ఎపిసోడ్ తో మరింతగా సోనుపై విమర్శలకు పదును పెట్టే అవకాశం ఉంటుంది.
చిన్న మరక కూడా లేకుండా లాక్ డౌన్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ.. ఇప్పుడిక పూర్తి స్థాయిలో బురద చల్లించుకోడానికి రెడీ అయ్యారన్న మాట. ప్రతిపక్షాలు చేసే అడ్డమైన విమర్శల్ని ఆయనిక ఎదుర్కొనక తప్పదు.