మే 14, 2004. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడి, ముక్కలు చెక్కలుగా ఉన్న కాంగ్రెస్ ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రాజన్న రాజ్యం తెచ్చారు. 17ఏళ్ల తర్వాత కూడా వైఎస్ఆర్ పాలన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన తీసుకొచ్చిన పథకాలు అలాంటివి.
ఇప్పుడు కూడా ఏపీలో రాజన్న రాజ్యమే ఉంది. అయితే అంతకు మించి అన్న స్థాయిలో రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తవుతుంది. దాదాపు ఐదున్నరేళ్ల రాజశేఖర్ రెడ్డి పాలనను కేవలం రెండేళ్లలో సీఎం జగన్ మరిపించారంటే అతిశయోక్తి కాదు.
కొత్తగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆఫీసర్ ఎలాంటి హడావిడి చేస్తారో, అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాజకీయ నేతలు కూడా అంతకంటే ఎక్కువ హడావిడి చేస్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వరుసబెట్టి అమలులో పెడుతుంటే.. అంతా కొత్త మోజు అని కొట్టిపారేశారు. అమ్మఒడి, రైతు భరోసా, సున్నావడ్డీ.. అంటూ నేరుగా డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలోకే బదిలీ చేస్తుంటే.. అప్పుల కుప్పలా రాష్ట్రాన్ని తయారు చేసిన ప్రతిపక్షాలు నవ్వుకున్నాయి. ఇంకెన్నాళ్లీ సంబరం అంటూ చంకలు గుద్దుకున్నాయి.
సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు-నేడు పనులు.. ఇలా ప్రతి చోటా అభివృద్ధిని కళ్లకు కట్టిన జగన్.. ఏడాది పాలన పూర్తయ్యే లోగానే కరోనా కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆదాయం పడిపోయింది. కేంద్రం ఉన్నట్టుండి లాక్ డౌన్ పెట్టడంతో ప్రజలు అల్లాడిపోయారు. జగన్ పనైపోయిందని అనుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అంచనా వేశారు. అయినా కూడా జగన్ తట్టుకుని నిలబడ్డారు.
కరోనా ఫస్ట్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని నిరూపించారు. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదు. పోలవరాన్ని పరుగులు పెట్టించారు. ఇటు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమచేయడం కూడా ఆలస్యం కాలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఊహించని మెజార్టీ వైసీపీకి ఇచ్చారు.
జగన్ పాలనలో రెండో ఏడాది, కరోనా కష్టకాలంలో సెకండ్ వేవ్.. అయినా సరే ఎక్కడా అభివృద్ది, సంక్షేమం ఆగలేదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 90శాతం నెరవేర్చారు జగన్. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఏ పార్టీ కూడా మేనిఫెస్టోని ఈ స్థాయిలో అమలు చేసిన దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేవు.
నవ్యాంధ్రలో తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ తన మేనిఫెస్టోని ఆన్ లైన్ నుంచి తొలగించిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ మాత్రం 23 నెలల్లోనే తన పరిపాలనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. 23నెలల కాలంలో రూ.89 వేల కోట్ల రూపాయల్ని నేరుగా ప్రజల ఖాతాలో జమ చేసి అవినీతికి తావులేకుండా సంక్షేమాన్ని చాటారు.
రాజన్న రాజ్యం – రైతురాజ్యం అయితే.. జగనన్న రాజ్యం రైతుబాంధవుడి రాజ్యంగా వెలుగొందుతోంది. రైతు భరోసా నిధులు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ బీమా, 24గంటల ఉచిత విద్యుత్, ధాన్యం సేకరణలో పారదర్శకత.. ఇలా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాల్ని చేపట్టి ఏకంగా అన్నదాతల కోసం రూ.68వేల కోట్లు ఖర్చు చేశారు.
ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎన్నాళ్లు ఉన్నామన్నది కాదు, తమ గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారన్నదే ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబుపై సింపతీ ఉండాల్సింది పోయి, చీవాట్లు పెడుతున్నారు ప్రజలు, చీదరించుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం.
అదే సమయంలో సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలే ప్రచార రథసారధులుగా ఉన్నారు. అడుగడుగునా రాజన్న పాలన గుర్తు చేస్తూ, అంతకు మించి ప్రజలకు బాసటగా నిలుస్తూ.. వైఎస్ఆర్ లేని లోటుని జగన్ సార్ భర్తీ చేస్తున్నారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజుని ప్రజలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారంటే.. తండ్రి పాలనతో పాటు.. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కారణం.