హోదా ప్రత్యేకమే…ఎన్ని మెలికలో …?

ప్రత్యేక‌ హోదా. అసలు ఈ మాట కనిపెట్టిన వారు కూడా దీనికి ఇన్ని వంకలు, డొంకలు, మెలికలు ఉంటాయని అసలు ఊహించి ఉండరు. ప్రత్యేక హోదా అంటేనే మహా పాపం అన్నట్లుగా, అది ముగిసిపోయిన…

ప్రత్యేక‌ హోదా. అసలు ఈ మాట కనిపెట్టిన వారు కూడా దీనికి ఇన్ని వంకలు, డొంకలు, మెలికలు ఉంటాయని అసలు ఊహించి ఉండరు. ప్రత్యేక హోదా అంటేనే మహా పాపం అన్నట్లుగా, అది ముగిసిపోయిన అధ్యాయంగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తుండడాన్ని చూసిన ప్రతి ఆంధ్ర హృదయం ఆవేశపడక మానదు.

ఇంతకీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకింత మాటల తిప్పులాటలు, పద విన్యాసాలూ అంటే అక్కడే ఉంది మ్యాజిక్. హోదా పేరిట ఏపీకి ఎంతో కొంత ఆర్ధిక స్తోమత వస్తుందని అంతా నమ్ముతున్నారు. కాస్తా విభజన గాయాలను మానుపుకుని సేదతీరుతుందని కూడా ఆశిస్తున్నారు.

కానీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టిన నాడు ఇచ్చిన మాట ప్రకారం హోదా ఇమ్మంటే మాత్రం ఏలికలకు సమస్త రూల్స్ గుర్తుకు వస్తున్నాయా అని అంతా మండిపడుతున్నారు. లోక్ సత్తా ఏపీ ప్రెసిడెంట్ భీశెట్టి బాబ్జీ అయితే కేంద్రం మీద మండిపడ్డారు. అసలు బోడి గుండుకూ మోకాలుకు సంబంధం ఏంటి అన్న తీరున హోదాకు 14వ ఆర్ధిక సంఘానికి మధ్య ఎందుకు లేని లింక్ పెడుతున్నారు అని ఆయన నిలదీస్తున్నారు.

ప్రత్యేక హోదా కాకపోతే వేరే పేరు మార్చుకోండి. ఏపీకి చేయాల్సిన ఆర్ధిక సాయం మరో రూపంలో చేయండి, అంతే తప్ప ముగిసిన అధ్యాయమంటూ మండే మాటలు వద్దు అని బాబ్జీ ఘాటుగానే మాట్లాడారు. అసలు ఇంతకీ ఏపీకి సాయం చేయడానికి కేంద్రానికి ఎందుకు మనసు రావడం లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఏపీకి ఎంతో చేశామని, విభజన హామీలు అన్నీ కూడా నెరవేర్చామని చెబుతున్న కేంద్ర పెద్దలు ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు ఏంటో శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఏపీకి అన్నీ ఇచ్చేశామని అంటున్న పెద్దలు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా…ఏమో.