ఈ మాట కేంద్రం చెప్పడంలేదు. ఏపీ బీజేపీ నాయకులు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎవరు చెప్పారు. అదంతా వట్టి మాట. స్టీల్ ప్లాంట్ లో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది అంతే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.
ఈ విధంగా దేశవ్యాప్తంగా 25 పరిశ్రమలలో చేస్తున్నామని కూడా ఆయన సెలవిస్తున్నారు. ఏం జరిగినా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. అలాగే నిర్వాసితుల హక్కులను కాపాడుతామని చెబుతున్నారు.
దీని కోసం అనేక ప్రత్యామ్యాయాలను కూడా సూచించామని మాధవ్ చెబుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకు అసలు నిజాన్ని బీజేపీ నేతలు ఒప్పుకుని జనాలకు మెల్లగా చెప్పేశారన్న మాట. ఓ వైపు సోము వీర్రాజు ప్రైవేట్ కాకుండా చూస్తామని అంటారు. అదే పార్టీకి చెందిన మాధవ్ ప్రైవేటూ లేదూ ఏమీ లేదు.
జస్ట్ పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే అని చెబుతారు. మరి అవ్వ పేరే ముసలమ్మ అని బీజేపీ నేతలకు ఎవరు చెబుతారు. మొత్తానికి విషయం అందరికీ అర్ధమైంది. ఏపీలో బీజేపీ నేతలు మాత్రం ఉక్కు సెగ నుంచి తప్పించుకోవడానికే ఈ రకమైన సమర్ధింపు మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు ఉద్యమకారులు.