అమరావతి విషయంలో జరుగుతున్న పరిణామాల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందట.. మూడు రాజధానులంటూ అమరావతిని నాశనం చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే, కేంద్రం చూస్తూ ఊరుకోదని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా 'పాడిందే పాటరా..' అన్న చందాన సుజనా చౌదరి గగ్గోలు పెడుతున్నా, కేంద్రం మాత్రం ఇప్పటిదాకా అమరావతి విషయమై ఏమాత్రం పట్టించుకోవడంలేదు.. పట్టించుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదు.
'రాజధాని ఎక్కడ వుండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదు..' అని గతంలోనే బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తేల్చి చెప్పారు. సుజనా చౌదరి కూడా ప్రస్తుతం బీజేపీలోనే వున్నా, పార్టీలో ఆయన వాదనతో ఎవరూ ఏకీభవించకపోవడం గమనార్హం. నిజానికి, వైసీపీకి అధికారంలోకి వస్తూనే రాజధానిపై సంచలన నిర్ణయం తీసుకోబోతోందంటూ అప్పట్లో జీవీఎల్ జోస్యం చెప్పిన విషయం విదితమే. అదే నిజమవుతోందిప్పుడు.
ఇటీవల ఏపీ బీజేపీ, అమరావతికి మద్దతుగా తీర్మానం చేసినా.. బీజేపీలో ఇంకా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే వున్నాయి. విశాఖకు చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, రాజధానికి విశాఖ అనుకూలమని చెబుతున్నారు. విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నామనీ చెప్పారాయన. నిన్న మొన్నటిదాకా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్‌ని బీజేపీ నేతలు సమర్థించిన విషయం విదితమే. ఆ మాటకొస్తే, ఎన్నికలకు ముందే బీజేపీ, రాయలసీమకు హైకోర్టు.. అనే వాదనను తెరపైకి తెచ్చారు.
ఎలా చూసినా, బీజేపీ పరోక్షంగా మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్లే లెక్క. కానీ, సుజనా చౌదరి మాత్రం తన పాత బాస్ చంద్రబాబు మీద మమకారాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. దాన్ని మించి, అమరావతి మీద ఏదో తెలియని ప్రత్యేకమైన 'ప్రేమ' ఆయన్ని, బీజేపీకి సైతం వ్యతిరేకంగా వెళ్ళేలా చేస్తున్నట్లే కన్పిస్తోంది. రేపో మాపో మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అధికారికంగా ప్రకటించబోతోంది.. ఆ తర్వాత కేంద్రం సుజనా చెబుతున్నట్లు స్పందిస్తుందా.? లైట్ తీసుకుంటుందా.? లైట్ తీసుకోవడానికే అవకాశాలెక్కువ.