రాజ్యసభ సభ్యుడు,టీడీపీ నుంచి తమ పార్టీలోకి ఫిరాయించిన నాయకుడు సీఎం రమేశ్‌కు సొంత పార్టీ నేతే గాలి తీశారు. టీడీపీతో పొత్తు విషయమై సీఎం రమేశ్‌కు సునీల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్‌లో టీడీపీతో పొత్తు ప్రశ్నే వుండదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ తేల్చి చెప్పారు. దీంతో బీజేపీలో టీడీపీ అనుకూల నాయకుల మాటకు విలువ లేదని పరోక్షంగా చెప్పినట్టైంది.
ఇటీవల బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పొత్తుల విషయమై సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది ఢిల్లీ పెద్దలు తేల్చుతారన్నారు. అంతేగానీ, తాను, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డో, సునీల్ దేవ్‌ధరో చెప్పేది కాదని స్పష్టం చేశారు.
అంతకు ముందు పలు సందర్భాల్లో టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండనే ఉండదని సునీల్‌దేవ్‌ధర్, సోము వీర్రాజు చెప్పిన సంగతి తెలిసింది. వాళ్ల మాటలను ఖండించే క్రమంలో సీఎం రమేశ్ కాస్త దూకుడు ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చి పెత్తనం సాగిస్తున్న సీఎం రమేశ్‌కు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సునీల్ కఠినంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ రెండూ అవినీతి, కుల, కుటుంబ పార్టీలేనని స్పష్టం చేశారు. బద్వేల్‌లో వైసీపీ భారీ రిగ్గింగ్, దొంగ ఓట్లు వేయించుకుందన్నారు.
టీడీపీకి ఒక దశ, దిశ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీకి తాళం వేశారని, ఆంధ్రాలోనూ త్వరలోనే తాళం పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కెమెరా ముందు వ్యాఖ్యానించడం చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదన్నారు. అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో సీట్ల కోసం, సీఎం పదవి కోసం పొత్తు గురించి మాట్లాడే ఆలోచన చేయబోమన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జి, సహ ఇన్‌చార్జిలే పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని ఆయన చెప్పడం ద్వారా…సీఎం రమేశ్‌కు దీటైన సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వానికి తామే కళ్లు, చెవులు అని స్పష్టం చేయడం ద్వారా…టీడీపీతో పొత్తుపై తమ అభిప్రాయాలే ఫైనల్ అని తేల్చినట్టైంది.
పార్టీలో హైకమాండ్ వేరు, ఇన్‌చార్జిలు వేరు కాదని వ్యాఖ్యానించడం ద్వారా సీఎం రమేశ్ మాటలకు ఏ మాత్రం విలువ లేదని చెప్పినట్టైంది. తాము ఏ విషయంపై మాట్లాడినా పార్టీ అధిష్టానం ప్రతినిధులుగానే చెబుతామనడంతో సీఎం రమేశ్‌కు బీజేపీలో స్థానం ఏంటో సమాజానికి సునీల్ చూపినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.