సాధారణ వ్యక్తులు, రాజకీయ నేతలు, ఇతరత్రా వర్గాల ప్రజానీకానికే కాదు…సర్వోన్నత న్యాయస్థానానికి కూడా మీడియా వక్రీకరణ బాధ తప్పలేదు. గత కొంత కాలంగా ఏపీ హైకోర్టులో జరిగే వాదనలను జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ఏ విధంగా రాస్తున్నదో తెలుగు సమాజానికి బాగా తెలుసు.
ఇటీవల మూడు రాజధానుల అంశంపై సాగుతున్న విచారణలో భాగంగా ధర్మాసనం చేసిన కామెంట్స్‌పై మీడియాలో నెగెటివ్‌గా రాయడాన్ని స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిసే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మీడియా తన రాజకీయ ఎజెండాకు అనుకూలంగా చివరికి న్యాయస్థానం వ్యాఖ్యలను కూడా చిత్రీకరించడం విమర్శలకు తావచ్చింది. ఇంత వరకూ మీడియా వక్రీకరణ బాధ జగన్‌కే పరిమితం అనుకున్నాం. ఇప్పుడు ఆ బాధ సుప్రీంకోర్టుకు తప్పడం లేదని తెలిసొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా తాము అనని అంశాల్ని, అన్నట్టు ఓ వర్గం మీడియా రాస్తూ తమను విలన్లుగా చిత్రీకరించడాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది. కాలుష్యంపై రెండో రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని కోర్టు ఆదేశించిందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాయడాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. “కావాలని చేస్తున్నారో ఏమో తెలియదు. మీడియాలోని ఓ వర్గం మమ్మల్ని విలన్లుగా చూపెడుతోంది. పాఠశాలలు మూసివేయాలని చెప్పామని అంటోంది. మేమెక్కడ చెప్పాం. అధిక కాలుష్యం ఉన్న సమయంలో పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారని, పిల్లలు మాత్రం పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పాం. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేస్తామని ఢిల్లీ ప్రభుత్వమే చెప్పింది” అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ జోక్యం చేసుకుంటూ… ఢిల్లీలో పరిపాలనను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించినట్టు మరో ఆంగ్ల పత్రిక రాయడాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ…”మీరు దానిని ఖండించాలి. పరిపాలన బాధ్యతలు చేపడతామని మేమెక్కడ అన్నాం. భావ స్వేచ్ఛను మేము అడ్డుకోలేం. ఎవరైనా విలేకరుల సమావేశం పెట్టుకోవచ్చు. మేం ఆ పని చేయలేం” అంటూ త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలనే వక్రీకరిస్తూ రాస్తున్న మీడియాకు… మిగిలిన ప్రజానీకం ఓ లెక్కా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. తమ వ్యాఖ్యలనే తప్పుగా చిత్రీకరిస్తున్న మీడియాపై చర్యలు తీసుకోకుంటే, ఇక సమాజానికి న్యాయ వ్యవస్థ ఎలాంటి సంకేతాలు పంపుతుందనే ప్రశ్నలు లేకపోలేదు.
తమకు తామే రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో ప్రజల హక్కుల్ని ఎలా కాపాడుతారనే మౌళిక ప్రశ్నలు తెరపైకి రావడం విశేషం. తమను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని స్వయంగా చీఫ్ జస్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే, సామాన్యుల పరిస్థితి? ..ఆన్సర్ ఫ్లీజ్!