నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఆందోళనపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనతో సామాన్య జనజీవనానికి ఇబ్బందిగా మారిందని, వెంటనే వాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ రిషబ్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
దీంతో పాటు రైతుల ఆందోళనకు మద్దతుగా మరిన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
రైతుల సమస్య పరిష్కారంలో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నూతన వ్యవ సాయ చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో రైతులతో చర్చలు జరపనంత వరకూ అవి విఫలమవుతూనే ఉంటాయని వ్యాఖ్యానించడం గమనార్హం.
రైతులతో కేంద్రం చర్చలు ఫలించేలా కన్పించట్లేదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది త్వరలో జాతీయ సమస్యగా మారే అవకాశముందని చీఫ్ జస్టిస్ బోబ్డే అన్నారు.
ఈ పరిస్థితుల్లో వివాద పరిష్కారం కోసం తామే ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీని ప్రభుత్వ , రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చీఫ్ జస్టిస్ చెప్పారు.
అయితే రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సొలిసిటర్ జనరల్ మెహతా వాదించారు. కాగా రైతుల ఆందోళనపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.