ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి అన్న చందంగా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి దేశమంతా ఒకదారిలో పయనిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ది మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఒకవేళ తాను వెళుతున్న దారి సరైందైతే తప్పక అభినందించాల్సిందే. కానీ అలా లేదనే భావన మెజార్టీ ప్రజల్లో కనిపిస్తోంది. పైగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సవాల్ విసురుతున్నట్టు…విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదన్నారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను అనేక రాష్ట్రాలు రద్దు చేసి, ఫలితాలను కూడా ప్రకటించాయి. మరోవైపు సీబీఎస్ఈ పరీక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఒకవేళ ఎవరైనా మార్కులతో సంతృప్తి చెందకపోతే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని, అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఇదంతా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజా ప్రకటన చూస్తే…. అందులో కసి, పట్టుదల కనిపిస్తున్నాయే తప్ప, విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు.
టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు డిమాండ్‌ను రాజకీయ కోణంలో చూస్తోందే తప్ప, ఆరోగ్య దృష్టితో ప్రభుత్వం చూడలేదనే విమర్శలున్నాయి. దీంతో జగన్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని, పిల్లలపై పంజా విసురుతుందనే హెచ్చరికల నేపథ్యంలో కూడా జగన్ సర్కార్ మొండిగా ఎందుకు వెళుతోందనే ప్రశ్నలు, నిలదీతలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
తమ పిల్లల మార్కులపై తల్లిదండ్రులకు లేని బాధ జగన్ సర్కార్‌కు ఎందుకనే ప్రశ్నలు ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 700 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు కరోనా సెకెండ్ వేవ్ ఉధృతికి ప్రాణాలు కోల్పోయారని, జగన్ సర్కార్‌లో మార్పు రావాలంటే ఇంకెంత మంది చావాలో చెప్పాలని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కనీసం కేంద్ర ప్రభుత్వం మాదిరిగా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి, మార్కులకు సంతృప్తి చెందని వాళ్లకు కరోనా తగ్గిన వెంటనే నిర్వహిస్తామని చెప్పేందుకు ఏపీ ప్రభుత్వానికి మనసు ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. జగన్ సర్కార్‌ది మొండితనమా? మూర్ఖత్వమా? అనేది అర్థం కావడం లేదని విద్యావేత్తలు అంటున్నారు.
మరోవైపు జగన్ ప్రభుత్వం బీరాలు పలుకుతూ, ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాలతో వెనక్కి తగ్గడం సర్వసాధారణమైందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.