తాలిబన్ల మతమౌడ్యం, స్త్రీల విషయంలో వారి విధానానికి సంబంధించి మరో పరాకాష్ట ఇది. ఐపీఎల్ మ్యాచ్ లను తమ దేశంలో ప్రసారం చేయడాన్ని తాలిబన్లు నిషేధించారు. ఎన్నింటినో నిషేధించిన తాలిబన్లు, ఐపీఎల్ ప్రసారాన్ని నిషేధించడం వింత కాదు కానీ, దీనికి వారు చెబుతున్న రీజనే మరీ విడ్డూరంగా ఉంది!
ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారం సమయంలో టీవీల్లో స్త్రీలు కనిపిస్తున్నారని తాలిబన్లు అంటున్నారట. వాళ్లు మ్యాచ్ లు వీక్షించడానికి వెళ్లిన వారు! తాలిబన్ల చెర లేని చోట మ్యాచ్ చూడటానికి స్త్రీలు వెళ్లారని, ఆ లైవ్ ప్రసారాలను తమ దేశంలో నిషేధించారు తాలిబన్లు. వేరే దేశం వాళ్లు అయినా.. టీవీల్లో ఆడవాళ్లు కనిపిస్తున్నారని.. తమ దేశంలో ప్రసారాలను నిషేధించేంత పరాకాష్టకు చేరింది తాలిబన్ల వ్యవహారం.
స్త్రీలకు వినోదం ఉండకూడదు అనేది తాలిబన్లు పాటిస్తున్న షరియా చట్టంలోని ప్రధానమైన షరతులాగుంది. అందుకే వారి విషయంలో అనేక కట్టుబాట్లను తీవ్రంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకూ ఆఫ్గాన్ ఉన్న మహిళా టీమ్ లను నిషేధించారు. తమ దేశం స్త్రీలు ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్లలోనూ పాల్గొనడానికి వీల్లేదని తాలిబన్లు నిషేధం పెట్టారు.
స్త్రీలకు క్రీడా అవకాశాలను ఇవ్వని తాలిబన్ల దేశంతో తమకూ సంబంధాలు వద్దని వివిధ దేశాలు అనుకుంటున్నాయి. ఆడవాళ్లు ఆడటానికి వీల్లేదని నిషేధం నేపథ్యంలో.. ఆఫ్గాన్ పురుషుల క్రికెట్ జట్టుతో టెస్టు మ్యాచ్ ను రద్దు చేసుకుంది ఆస్ట్రేలియా.
ప్రపంచం తమ దేశాన్ని రకరకాలుగా వెలి వేస్తున్నా తాలిబన్ల తీరు మాత్రం ఇంకా ముదురుతోంది. అందులో భాగంగానే.. వీక్షకుల్లో స్త్రీలు ఉంటారనే కారణాన్ని చూపి ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాన్ని నిషేధించారు.