టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను తాను ఆత్మ వంచన చేసుకోవడంతో పాటు తన వాళ్లను కూడా వంచిస్తున్నారు. తనను తాను వంచించుకునే నాయకుడు, ప్రజల్ని, నమ్ముకున్న నేతలను మోసగించడం పెద్ద పనేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సాధించని విజయాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడాన్ని చంద్రబాబు అవకాశంగా తీసుకున్నారు. దీనికి తోడు బాబు తానా అంటే …తందానా అనే ఎల్లో మీడియా ఉండనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ బలపడడం సంగతేమో గానీ, ఎల్లో మీడియాలో మాత్రం దూసుకుపోతోంది. ఇలాంటి తప్పుడు రాతలు రాసి, ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలని ఎల్లో మీడియా భావిస్తున్నదో, కనీసం ఆ రాసే వాళ్లకు, చూపేవాళ్లకైనా అర్థమవుతున్నదో లేదో మరి?
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు తీరుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. వైసీపీ మద్దతుదారుల గెలుపునకు సంబంధించి ఫొటోలతో సహా వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, ఆ దమ్ము టీడీపీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ప్రజలిచ్చిన తీర్పును బాబు వక్రీకరిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
తెలుగు తమ్ముళ్లను భ్రమల్లో పెట్టేందుకే చంద్రబాబు చిందులేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం 3,325 పంచాయతీలకు ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ అభిమానులు 2,613 స్థానాల్లో గెలిస్తే.. రెబల్స్ 36మంది గెలిచారని సజ్జల వెల్లడించారు. మొత్తం 2,649 మంది సర్పంచ్‌లుగా తమ మద్దతుదారులు గెలిచారన్నారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35.. ఇతరులు 98 స్థానాల్లో గెలుపొందినట్టు ఆయన లెక్కలు తేల్చారు.
అయితే టీడీపీకే 38 శాతం పంచాయతీలొచ్చాయని చంద్రబాబు మళ్లీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆఖరుకు ఎన్నికల ఫలితాల కోసం వైఎస్సార్‌సీపీ పెట్టిన వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్ సృష్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఫలితాల వక్రీకరణకు రెండు పత్రికలు, చానళ్లు వంత పాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
వాళ్లు చెప్పే అసత్యాలు, తాము చెప్పే నిజాలు.. రెండూ మీడియాలోకి వెళ్తున్నాయన్నారు. అయితే ప్రజలు అయోమయానికి గురి అయ్యే ప్రమాదం ఉందని, అందుకే ఎన్నికల ఫలితాల నిజానిజాలేంటో తేల్చాలని మీడియాను, జర్నలిస్టు నాయకులను ఆయన కోరడం గమనార్హం. నిజాలను నిగ్గు తేల్చడం మీడియా బాధ్యత కూడా అని ఆయన చెప్పుకొచ్చారు.