మార్చి నెలాఖరులో ఎటూ పదవీ విరమణ చేస్తున్నానని, పోతూపోతూ రాజకీయ పార్టీల మధ్య తండ్లాట పెట్టి తమాషా చూడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ భావించారా? అంటే, “ఔను” అనే సమాధానాలే వస్తున్నాయి. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు చెప్పే నిమ్మగడ్డకు, ఎన్నికల కమిషనర్‌గా తన పరిధి, పరిమితులేంటో తెలిసి కూడా …ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేయాలని కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఈసీ చర్యలతో కొందరిలో లేని ఆశలు రేకెత్తించడంతో పాటు ప్రలోభాలకు తెరలేపినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామి నేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన తర్వాత, ఇక ఆ ఎన్నికను రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఎంత మాత్రం ఉండదు. ఒకవేళ ఎన్నిక సరైంది కాదని ఎవరైనా భావిస్తే, దాన్ని న్యాయస్థానంలో నిరూపించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నిమ్మగడ్డ అడ్డదిడ్డంగా ఉత్తర్వులు జారీ చేయడం ఏంటనే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 18న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు ఎస్ఈసీ ఏకపక్ష ధోరణులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి వాదించారు. కానీ ఎన్నికల కమిషనర్ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్మ్యాన్లా వ్యవహరిస్తున్నారని ఆయన న్యాయస్థానానికి నివేదించారు.
పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ…ఈ నెల 23వ తేదీ వరకూ ఎలాంటి విచారణ జరపవద్దని ఆదేశించింది.
ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిమ్మగడ్డ మనసులో కుట్రపూరిత ఆలోచనలు ఉండడం వల్లే అర్ధాంతరంగా ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరపకుండా, పంచాయతీ ఎన్నికలను చేపట్టారని ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది.
ప్రభుత్వం చేస్తున్న వాదనే … ఇప్పుడు నిజమని, ఎస్ఈసీ చర్యలే చెబుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికో రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు …. అన్నీ తెలిసి కూడా నిమ్మగడ్డ అభాసుపాలయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల మధ్య గొడవ పెట్టి, తాను తమాషా చూడాలనుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.