అవతల చంద్రబాబు నాయుడేమో మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవంటూ ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. గతంలో మోడీని చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలన్నారో ఎవరికీ తెలియని సంగతులు ఏమీ కావు. ఆఖరికి మోడీ భార్య గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే తనకు కుటుంబం ఉందని, రాజకీయాలను వదిలి కుటుంబంతో గడపుతానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. అదే ఎన్నికల్లో ఓడిపోతే మోడీకి కుటుంబం కూడా లేదంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
మోడీ మీద దేశంలో ఎవ్వరూ చేయనన్ని విమర్శలు, ఎవ్వరూ చేయనంత వ్యతిరేక ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ విషయంలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు కూడా వెనుకే ఉంటారు. తన లెక్కల మేరకు చదంద్రబాబు నాయుడు అప్పుడు అలా మాట్లాడారు.
ఇప్పుడు ఆయన లెక్కలు మారాయి. అందుకే మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని ప్రకటించుకున్నారు. ఇదంతా మళ్లీ బీజేపీ ప్రాపకం కోసమే అనే టాక్ మొదలైంది. ఈ సమయంలో బీజేపీ వాళ్లు ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. జీవీఎల్, కన్నా లాంటి వాళ్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
అయితే బీజేపీలోని చంద్రబాబు నాయుడి భక్తులు ఇప్పుడు ఇంకా స్పందించడం లేదు. ఇటీవలే చంద్రబాబు నాయుడి అనుచరగణం మూకుమ్మడిగా కమలం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వారు బీజేపీలోకి విలీనం అయ్యారు. అయితే వారిని చంద్రబాబు నాయుడే పంపించారనే అభిప్రాయాలూ ఉన్నాయి.
చంద్రబాబు నాయుడును అక్కడ ఉండి కాపాడటానికి వారు వెళ్లారనేది చాలా గట్టిగా వినిపించే అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కమలం పార్టీలోని పాతవాళ్లు చంద్రబాబు మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మిగతా అన్ని విషయాల గురించి తెగ రియాక్ట్ అయ్యే బీజేపీలోని చంద్రబాబు నాయుడి అనుచవర్గం మాత్రం ఇప్పుడు కామ్ గా ఉండటం గమనార్హం.