వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నీ ఉచితంగా పంచేస్తున్నారు.. అంటూ కొంతమంది మొత్తుకుంటున్నారు. అవతల మన్మోహన్ సింగ్ లాంటి మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త కూడా.. ఈ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచండని సూచిస్తున్నారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ తో సహా అనేక మంది ఆర్థిక వేత్తలు ఉచితాలకు వ్యతిరేకం. అయితే అలాంటి వారు కూడా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు పెరగాలంటే ఉచితమే ఉచితం అని అంటున్నారు. పెద్ద పెద్ద ఆర్థిక వేత్తల మాట అది. మోడీ కూడా అదే పని చేయాలని వారు సూచిస్తున్నారు. మోడీ మాత్రం వారి సూచనలను పట్టించుకోవడం లేదు, తనకు తోచిందే ఆయన చేస్తున్నారు.
ఇక ఏపీలో ఉచిత విద్యుత్ అంశం గురించి కొత్త గొడవ రేగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్ అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని సబ్సీడీలనూ నగదు బదిలీ అని అంటోంది కదా.. ఉచిత విద్యుత్ అంశాన్ని కూడా అదే తీరున అమలు చేయాలని సిఫార్సు చేసింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అదనపు సౌలభ్యాలు కలగనున్నాయి. అలాగే ఉచితంగా ఇచ్చేస్తుంటే ఒక లెక్కాపత్రం ఉండదని మీటర్లు బిగించాలనే సూచన ముందు నుంచి ఉంది. అయితే ఇన్నాళ్లూ ఆ సూచనను పట్టించుకోలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ విద్యుత్ కు మీటర్లను బిగించడానికి జగన్ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
ఇంకేముంది.. రచ్చరచ్చే! అప్పుడే తెలుగుదేశం నేతలు మాట్లాడేస్తున్నారు. మీటర్లు బిగించినా రైతులు తాము బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రతినెలా రీడింగ్ ను తీస్తారు, ఆ డీటెయిల్స్ ప్రభుత్వానికి వెళ్తాయి, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది, ఆ మొత్తంతో రైతుల ఆన్ లైన్ లోనో, ఊర్లోనో బిల్లు పే చేసుకోవచ్చు. సచివాలయంలో కూడా ఆ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు.
మార్పు ఏమిటంటే.. ఇన్నాళ్లూ లెక్కాజమ లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ జరిగింది. ఇకపై రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతుంది. అంతే తేడా. మీటర్లూ గట్రా ఖర్చు కూడా ప్రభుత్వమే భరించబోతోంది.
అసలే ఏపీలో ప్రతిపక్ష పార్టీ స్పందించడానికి విషయాలు లేక.. ఊర్లలో జనాలు గొడవ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా.. దానికీ కుల రంగును అద్ది రచ్చ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ మీటర్ల అంశంపై ఆ పార్టీ మరింత రచ్చను చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రతిపక్షం ఏం చెప్పినా, రైతులకు మాత్రం ప్రాక్టికల్ అన్నీ అర్థం అవుతాయి.