గంటా శ్రీనివాసరావుది ఇరవయ్యేళ్ల రాజకీయ జీవితం. ఆయన ఇప్పటికి తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, ఇలా రాజకీయ ప్రస్థానం సాగించారు. ఇపుడు ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు అంటున్నారు.
ఇక గంటా ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గం మారుస్తారని ఎటూ పేరుంది. ఇపుడు పార్టీని మళ్ళీ మారుస్తామంటే విడ్డూరం లేదు కానీ తమ్ముళ్ళే తట్టుకోలేకపోతున్నారుట. గంటా టీడీపీలో ఉన్నా ఏడాదిగా మౌనంగానే ఉంటూ వస్తున్నారు.
ఇపుడు ఆయన వైసీపీ వైపు చూస్తూంటే తమ్ముళ్ళు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారుట. తాము మాత్రం టీడీపీలో ఉంటామని గట్టిగానే చెబుతున్నారుట. గంటాకు జిల్లా అంతటా అనుచరులు ఉన్నారు. వారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారో చెప్పలేమని అంటున్నారు.
ఇక గంటా వెంట కనీసంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తారని ఆ మధ్య దాకా వినిపించింది. అలాగే కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా గంటాతో పాటే అధికార పార్టీలో చేరుతారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఇపుడు గంటా కనుక వైసీపీలో చేరితే ఆయన తప్ప మరే ఎమ్మెల్యే కూడా అనుసరించరు అంటున్నారు.
అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు, బోలెడు అనుచరగణం కలిగిన గంటాకు కీలక వేళ ఆయన వర్గీయులే హ్యాండ్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మాటిమాటికీ పార్టీలు మారడం మంచిది కాదన్నది అనుచరుల్లో ఆవేదనగా చెబుతున్నారు. ఏది ఏమైనా గంటా కనుక పార్టీ మారితే గతంలోలా పెద్ద ఎత్తున బలగాన్ని తన వెంట తీసుకుపోయే సీన్ ఇపుడు ఉందా అన్నది చూడాలని అంటున్నారు.