పాపం.. ముఖ్యమంత్రి జగన్ పై ఎలాంటి విమర్శలు చేయాలో కూడా అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీకి. దీనికితోడు లోకేష్ ను ఎలా జాకీలు పెట్టి పైకి తీసుకురావాలో కూడా తెలియడం లేదు. అందుకేనేమో బాగా ఆలోచించి అర్థరాత్రి ఓ పోస్టు పెట్టింది. అదేంటంటే.. వరదలొస్తే జగన్ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారట. చినబాబు మాత్రం మోకాలు లోతు నీటిలో దిగి క్షేత్రస్థాయిలో పర్యటించారట.
విమర్శలొస్తాయని భావించి అర్థరాత్రి వేళ టీడీపీ ఈ పోస్టు పెట్టినా.. జనం మాత్రం ఊరుకోలేదు. ఆ పార్టీని, లోకేష్ ను చెడామెడా వాయించేస్తున్నారు. ఈ ఫొటోతో కొడుకును హీరోను చేసేందుకు బాబు ప్రయత్నిస్తే.. అది ఆయనకే రివర్స్ లో తగిలింది. గతంలో చంద్రబాబు విమానాల్లో, హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టిన లీలలు అన్నింటినీ బయటకు తీస్తున్నారు జనం.
నిజమే… తన పాలనలో సగం సమయాన్ని విమానాల్లోనే గడిపేశారు బాబు. మరీ ముఖ్యంగా ఆయన హయాంలో వరదలు వచ్చినప్పుడు బాబు ఏం చేశారో ఓసారి గుర్తుచేసుకుందాం. ఓవైపు రాష్ట్రంలో పెథాయ్ తుపాను విరుచుకుపడితే.. బాబు మాత్రం మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లారు.
ఇలాంటిదే మరో సందర్భం కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాను వణికించింది. ఉత్తరాంధ్ర మొత్తం అతలాకుతలం అయిపోతే.. చంద్రబాబు మాత్రం విమానం ఎక్కి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రులతో భేటీలు జరిపారు. వాళ్లతో టిఫిన్లు, భోజనాలు చేశారు.
అంతెందుకు.. చివరికి రాష్ట్రంలో వరదలొచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేసినప్పుడు కూడా చంద్రబాబులో ఆ సీరియస్ నెస్ కొరవడింది. హెలికాప్టర్ నుంచి ముంపు ప్రాంతాల్ని చూస్తూనే, మరోవైపు టీ తాగుతూ, టిఫిన్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా.
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు విమాన పర్యటనలు, హెలికాప్టర్ తో చేసిన ఏరియల్ సర్వేల గురించి పెద్ద గ్రంథమే రాయొచ్చు. ఇవన్నీ మరిచిపోయిన టీడీపీ, జగన్ ఏరియల్ సర్వే చేస్తే మాత్రం తప్పుపడుతోంది.
పోనీ ఇవన్నీ పక్కనపెట్టేద్దాం.. చీప్ గా లోకేష్ తో కంపేర్ చేస్తూ పోస్టు పెట్టారు కాబట్టి.. గతంలో లోకేష్ ఏం చేశారో చూద్దాం. తన హయాంలో వరదల టైమ్ లో లోకేష్ కారు నుంచి కాలు కిందకు పెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎక్కడో వరదలొస్తే, ఇంకోచోట పర్యటించి.. ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోయింది లోకేష్ కాదా. అంతెందుకు.. గతంలో బాబు హయాంలో ఓ సందర్భంలో భారీగా వరదలొస్తే, లోకేష్ తన పెళ్లి రోజును ఆర్భాటంగా జరుపుకోలేదా.
అంతెందుకు.. జగన్ పాదయాత్రను ఓసారి గుర్తుకుతెచ్చుకుంటే సరిపోదా. ఎండాకాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా అవిశ్రాంతంగా ప్రజల మధ్య ఉంటూ, వాళ్ల కష్టనష్టాలు తెలుసుకున్న చరిత్రను టీడీపీ మరిచిపోయినట్టుంది. ఈ చరిత్రను మరిచిపోవడమే కాకుండా.. ఫొణి తుపాను వచ్చినా, వరదలు వచ్చినా లోకేష్ ప్రజల మధ్యనే ఉన్నారంటూ ఓ పెద్ద ఆబద్ధం ఆడేసింది ఆ పార్టీ.
చంద్రబాబు ఎన్ని కుయక్తులు పన్నినా, ఇంకెన్ని అబద్ధాలు ఆడినా.. నిజాలేంటనేది ప్రజలకు తెలుసు. ఈ వరదల టైమ్ లో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, లోకేష్ ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నారనేది కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఆ పార్టీ లోకేష్-జగన్ ను కంపేర్ చేస్తూ.. నక్కకు-నాగలోకానికి ముడిపెట్టడం మానుకోవాలి.