సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. మరో వైపు ఏపీలో తమ బలం చాలా పెరిగింది అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. కానీ విశాఖ వంటి సిటీలో మాత్రం తమ్ముళ్లకు ఎందుకో సొంత పార్టీ మీద నమ్మకం కుదరడం లేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.
మహా విశాఖ నగర పాలక సంస్థలో అరవైకి పైగా కార్పోరేటర్లతో అధికార వైసీపీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. అయితే ఇపుడు టీడీపీకి చెందిన ఒక సీనియర్ కార్పోరేటర్ తన రూటు మార్చేసి ఫ్యాన్ నీడకు చేరడానికి చూస్తున్నారు అన్న వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి.
ఇందుకు గానూ ఆయన ఉగాదిని ముహూర్తంగా ఎంచుకున్నారని అంటున్నారు. ఆ రోజున తానూ తనతో పాటు మొత్తం టీడీపీ బ్యాచ్ ని సైకిల్ దింపేసి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేయడానికి చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. 87వ వార్డుకు చెందిన ఈ కార్పోరేటర్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు.
ఆయన వైఖరి మీద షోకాజ్ నోటీస్ ని మాత్రమే జారీ చేసిన టీడీపీ అధినాయకత్వం ఆయన ఫ్యాన్ పార్టీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నా కూడా ఆలా చూస్తూ ఉండిపోతోంది అన్న ప్రచారమూ ఉంది. మొత్తానికి ఆయన ఉగాది రోజుల చేదునే టీడీపీ పెద్దలకు తినిపించబోతున్నారు అని అంటున్నారు.
బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈ కార్పోరేటర్ కనుక జెండా ఎత్తేస్తే 87వ వార్డు మొత్తం సైకిల్ పార్టీ ఖాళీ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.