ఒకవేళ బద్వేల్ ఉప ఎన్నికపై చర్చ మొదలైనప్పుడే.. తెలుగుదేశం పార్టీ ఈ తరహా నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే, ఏమోలే అనుకోవచ్చు కానీ, ఉప ఎన్నిక ఖరారు అయ్యాకా… తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల సమయంలో.. ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నిక పోరు నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించింది.
ఇది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అనుభవిస్తున్న రాజకీయ బేలతనాన్ని చాటే అంశం. ఒక్క బద్వేల్ లోనే కాదు.. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో అత్యంత బలహీనంగా ఉంది. చాలా చోట్ల ఇన్ చార్జిల ఊసు లేదు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్న చోట కూడా వారు క్యాడర్ ను పట్టించుకుంటున్నది లేదు.
ఇక అధినేత చంద్రబాబు నాయుడు కేరాఫ్ హైదరాబాద్. లోకేషేమో రెండు మూడు రోజుల హడావుడి ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు అడ్రస్ ఉండరు! ట్వీట్లేస్తే.. వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ సీరియస్ గా కంటెస్ట్ చేసినా.. కనీసం డిపాజిట్ వస్తుందా? అనేది బిగ్గెస్ట్ కొశ్చన్. ఆ ప్రశ్నకు సమాధానం దొరకనీయదలుచుకున్నట్టుగా లేదు టీడీపీ.
అభ్యర్థిని ప్రకటించిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి మానవీయ కోణం గుర్తుకు వచ్చిందా? ఒకటికి రెండు సార్లు అభ్యర్థి పేరును ప్రకటించి.. తీరా నామినేషన్ సమయంలో మానవీయ కోణం అంటూ టీడీపీ తప్పుకోవడం ఆ పార్టీ తప్పించుకుంటున్న తీరును హైలెట్ చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ముందు రోజు ప్రకటించిన పవన్ కల్యాణ్, రెండో రోజు.. బద్వేల్ పోరులో ఉండమంటూ తేల్చేశారు. పలాయనవాదాన్ని నమ్ముకున్నారు. ఇక పవన్ తీరే తెలుగుదేశం పార్టీకి మార్గం చూపినట్టుగా ఉంది. పోటీ చేసి పరువు తీసుకోవడం కంటే.. తప్పుకోవడమే మంచిదన్నట్టుగా టీడీపీ వ్యవహరించిన వైనం స్పష్టం అవుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రెండున్నరేళ్ల పాలనలో తీవ్ర వ్యతిరేకత ప్రబలిందని చంద్రబాబు నాయుడు ఆన్ లైన్ మీటింగుల్లో వందకు వెయ్యి సార్లు చెబుతుంటారు. మరి.. అదెలా ఉందో చూపించే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఇలా పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నారు.