టీడీపీకి దొరకునా ఇలాంటి ‘నిరసనకారుడు’..!

ఏ రాజకీయ పార్టీకైనా ఏదో రూపంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. అనుకోని దెబ్బలు తగులుతాయి. ఏపీలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. అసలే సంక్షోభంలో ఉన్న ఈ పార్టీలో వెంటవెంటనే ఇద్దరు నాయకులు ప్రాణాలు…

ఏ రాజకీయ పార్టీకైనా ఏదో రూపంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. అనుకోని దెబ్బలు తగులుతాయి. ఏపీలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. అసలే సంక్షోభంలో ఉన్న ఈ పార్టీలో వెంటవెంటనే ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పవడం బాధాకరమే. ఇద్దరూ శివప్రసాదులే. ఇద్దరూ వైద్యులే. ఇద్దరూ అత్యంత సీనియర్లే. కాకపోతే ఒకరిది బలవన్మరణం, మరొకరిది అనారోగ్యం కారణంగా సంభవించిన సహజ మరణం. అనారోగ్యంతో చనిపోయిన చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌ విలక్షణ దళిత నాయకుడు. అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ ఒకే జిల్లావారు. శివప్రసాద్‌ నటుడు, దర్శకుడనే విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు విలక్షణ రాజకీయ నాయకుడు అనడంకంటే విలక్షణ నిరసనకారుడు అనడం సమంజసం.

రాష్ట్ర విభజన సమయంలో, ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు వేదికగా ఆయన సాగించిన నిరసనపర్వం విలక్షణం, ఆసక్తికరం. టీడీపీలో ఇలాంటి నిరసనకారుడు మరొకడు లేడు. బహుశా ఇక దొరక్కపోవచ్చు. ఆయన నటుడు కాబట్టి, కళలంటే ఆసక్తి కాబట్టి నిరసన పర్వంలో తన టాలెంటునంతా చూపించాడు. అరుపులు, కేకలు, నినాదాలతో నిరసన తెలపడం అందరూ చేసే పనే. కాని శివప్రసాద్‌ ఆ దారిలో వెళ్లకుండా రకరకాల వేషధారణలతో నిరసన తెలిపి ఎప్పటికీ గుర్తుండిపోయాలా చేసుకున్నాడు. ఆయన పేరు తలచుకుంటే రాజకీయ నాయకుడు అసలు గుర్తుకురాడు.

రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి వితంతువు వేషం వేసి రాష్ట్ర విభజన జరిగితే ఏపీ పరిస్థితి భర్త లేని మహిళ పరిస్థితిలా దీనంగా ఉంటుందన్నాడు. మరోసారి పొట్టి శ్రీరాములు వేషం వేశాడు. ఇంకోసారి 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి వేషం వేసుకుని విభజనను నిరసించాడు. విభజన కారణంగా ఏపీ వల్లకాడుగా మారుతుందని చెబుతూ సత్యహరిశ్చంద్ర వేషం వేశాడు. ఒకసారి బుడబుక్కల సాయిబు వేషం వేసుకొని రాష్ట్ర విభజనపై సోనియా గాంధీని విమర్శించాడు.  విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో శివప్రసాద్‌ కృష్ణుడి వేషంతో లోక్‌సభకు వెళ్లి సోనియా గాంధీ ఎదుటనే నిరసన (హిందీలో) తెలియచేశాడు.

అలనాడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు పాండవుల తరపున కృష్ణుడు కౌరవుల దగ్గరకు దూతగా వెళ్లాడని, ఇప్పుడు తాను సీమాంధ్ర ప్రజల తరపున దూతగా వచ్చానని, విభజన ఆపాలని కోరుతూ 'చెల్లియో చెల్లకో' పద్యాన్ని సోనియా గాంధీకి అన్వయించి పాడాడు. అదంతా ఆమెకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఒకసారి నారదుడి వేషం, మరోసారి భీముడి వేషం వేసుకొని నిరసన తెలియచేశాడు.  గతంలో టీడీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం పార్లమెంటు ఆవరణలో ఒకటి రెండుసార్లు ధర్నాలు చేసి నిరసన తెలియచేశారు. ఆ సమయంలో ఒకసారి పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే  శివప్రసాద్‌ కుచేలుడి వేషం వేసి రాష్ట్రం దీనావస్థపై పాట పాడాడు.

'ఇంతింత ఇంతింత విదిలించినట్లుంటే లోటు ఎప్పుడు పూడునో.. ఆంధ్ర రాత ఎప్పుడు మారునో' అని పాడాడు. బాబు అధికారంలో ఉనప్పుడు 'ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో గట్టిగా మాట్లాడండి' అని ఆదేశించగానే ముందుగా తయారయ్యేది శివప్రసాదే. రకరకాల వేషాలతో రెచ్చిపోయేవాడు. ఒకసారి ప్రత్యేకహోదా డిమాండ్‌ చేస్తూ టీడీపీ పార్లమెంటు సభ్యులు సభ లోపల నిరాదాలతో హోరెత్తిస్తుండగా, శివప్రసాద్‌ పార్లమెంటు ఆవరణలో భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద వేషం వేసుకొని తిరిగాడు. స్వామి వివేకానంద సూక్తుల పుస్తకం కూడా ఆయన చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాని మోదీకి వివేకం కలగడానికే తాను వివేకానంద వేషం వేశానని చెప్పాడు.

వివేకానంద నమ్మకం ముఖ్యమని చెప్పారని, అది కోల్పోకూడదని అన్నాడు. తాము బీజేపీని నమ్మి గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని, మోదీ ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించారని, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని శివప్రసాద్‌ విమర్శించాడు. ఉప్పులేని కూర చప్పగా ఉన్నట్లు శివప్రసాద్‌ వేషం వేసుకురాకుండా ఉంటే ఆ నిరసన కూడా అలాగే ఉంటుందని ఆయన అభిమానులు అనేవారు. ఆయన ఎన్ని విచిత్ర వేషాలేసినా రాష్ట్ర విభజన ఆగలేదు. ప్రత్యేకహాదా రాలేదు. శివప్రసాద్‌ సినిమా రంగానికి పరిచయం చేసివుండకపోతే రోజా ఎక్కడ ఉండేదో. 

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు