ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్నప్పుడు ఆయనను ఒక మేధావిగా, తెలుగుదేశం పార్టీ వాయిస్ గా చూపించుకున్నారు. ఆయనేమో అధికారం చేతులు మారడంతో తను కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం మీడియా మరోరకంగా ఆనందిస్తోంది. అదేమిటంటే.. జూపూడి ప్రభాకర్ రావు చేరిక పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రగులుతూ ఉందట.
మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. తెలుగుదేశం పార్టీని ఒకరు వీడారు అనే విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది అనే మ్యాటర్ ను హైలెట్ చేయాలని తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయపడుతున్న వైనం చూస్తే ఇదొక ప్రహసనం. అంతజేసీ జూపూడి ఏ ప్రజా నాయకుడు కాకపోయా!
కుల రాజకీయానికి జూపూడిని చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారాలకే ఆయనను వాడుకునే అవకాశం ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీకి అంత అవకాశం దక్కేలాలేదు. అధికారానికి దాసోహం అన్నట్టుగా జూపూడీ జంప్ చేసేశారు. ఈ విషయాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కానట్టుగా తెలుగుదేశం పార్టీ.. జూపూడి చేరికపై వైఎస్సార్సీపీ అసహనం పెల్లుబుకుపోతోందని వార్తలను ఇస్తున్నారు. ఇదీ తెలుగుదేశం అనుకూల మీడియా తీరు.
ఏ స్థాయి నేతలు అయినా.. వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినా, ఆ పార్టీకి షాకే అని, ఆ పార్టీలోకి ఎవరైనా చేరినా ఆ పార్టీకి షాకే అని కథనాలు అచ్చేస్తూ ఉన్నారు. ఈ తీరుతోనే అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసుకుంటూ ఉంది. ఆ మధ్య ఆల్రెడీ వైసీపీ నుంచి బహిష్కరింపబడిన నేత ఒకరు తెలుగుదేశం పార్టీలోకి చేరితే.. అది జగన్ కు షాక్ అని ప్రచారం చేసుకున్న వాళ్ల నుంచి కొత్తగా ఇంకా ఏం ఎక్స్ పెక్ట్ చేసేది ఉంటుంది!