అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను అడ్డుకోవడమే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏకైక ఎజెండా అయ్యిందని అధికార పక్షం వైసీపీ విమర్శల్లో వాస్తవం కనిపిస్తోంది. ఇందుకు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ, శాసనమండలిలో టీడీపీ సభ్యుల వింత ప్రవర్తనే నిదర్శనంగా నిలుస్తోంది. సమావేశాలు చివరి దశకు చేరుకున్నప్పటికీ సభలో ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలనే స్పృహ టీడీపీ సభ్యులకు లేదని అధికార పక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది.
అసెంబ్లీలో తమ సభ్యుల ప్రవర్తను మండలిలో ప్రతిపక్షం ఆదర్శంగా తీసుకోవడం విశేషం. ఇవాళ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన పెద్దల సభకు మచ్చ తెచ్చేలా ఉందని అధికార పక్షం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కల్తీసారా మరణాలపై చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదని టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా మండలిలో టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్‌ను చుట్టుముట్టి సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డు తగిలారు. దీంతో టీడీపీ సభ్యులు అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్‌లను సస్పెండ్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులు దిగజారిపోతారని అస్సలు ఊహించలేదన్నారు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దల సభలో చిల్లరగా గలాటా చేస్తు న్నారని మండిపడ్డారు.