అవును, ఈ డౌట్ సగటు జనాలలో కలిగేలా టీడీపీ ఎంపీల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి మొత్తం 120 మంది ఎంపీల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పిస్తామని ఈ మధ్యన చెప్పారు.
ఇపుడు ఆ పనిలో ఆయన బిజీగా ఉన్నారు. మొత్తానికి దేశంలోని విపక్ష ఎంపీల సంతకాలను కూడా సేకరించారు. ఆ వినతిపత్రంలో లోక్ సభ, రాజ్యసభలోని ప్రతిపక్షాలలోని వైసీపీతో పాటు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, శివసేన, ఐయూఎంఎల్, ఆర్జేడీ, బీజేడీ, సీపీఎం, ఎన్సీపీ, ఎన్సీ, ఎంఐఎం, ఆర్ఎల్పీ, ఆర్ఎస్పీ, తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. అంతే కాదు, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంతకాలు చేసి మద్దతు తెలిపారు.
చిత్రమేంటి అంటే ఈ వినతిపత్రం మీద టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయడానికి నిరాకరించారని తెలుస్తోంది. లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో ఒకరు ఉన్నారు. మరి ఆ నలుగురు ఎంపీలు ఎందుకు సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు అన్నదే చూడాలి.
ఇక్కడ లీడ్ తీసుకున్నది వైసీపీ ఎంపీ, అందునా విజయసాయిరెడ్డి, అంటే జగన్ కుడి భుజం. దాని వల్లనేనా రాజకీయ కారణాలతో టీడీపీ ఎంపీలు వినతిపత్రం మీద నో సిగ్నేచర్స్ అన్న రూల్ ని అమలు చేస్తున్నారు అని విమర్శలు అయితే వస్తున్నాయి.
దీని మీద ఉక్కు ఉద్యమ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇలా అయితే ఎలా బాబు గారూ అని అంటున్నాయి. ఉక్కు అన్నది అందరిదీ. అది ప్రజల ఆస్తి. దానికి రాజకీయాలతో సంబంధం లేదు. వైసీపీ టీడీపీ ఎవరైనా కామన్ కాజ్ ఒకటే అయినపుడు సంతకాలు చేస్తే తప్పేంటి అన్నదే కార్మిక లోకం మాట. మరి దీని మీద టీడీపీ తన స్టాండ్ మార్చుకుంటుందా. లేక రాజకీయమే చేస్తుందా. ఏమో చూడాలి.