45 యేళ్లకే పెన్షన్ వ్యవహారంలో తాము మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పింది అధికార పక్షం. అయితే ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారంటూ తెలుగుదేశం వాదించింది. అందుకు రుజువుగా ఒక పేపర్ కటింగ్ ను టీడీపీ ప్రస్తావించింది. కానీ తాము చెప్పినమాట తప్పడం లేదంటూ.. తన ఎన్నికల ప్రచార సభలో చెప్పిన విషయాన్ని వీడియోగా ప్రదర్శింపజేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఆ వీడియోలో చెప్పినట్టుగా, తమ ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమ హామీల అమలు ఉందని సీఎం స్పష్టంచేశారు. అయితే ఒక పేపర్ కటింగ్ ను పట్టుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో రచ్చచేసింది.
సభా కార్యకలాపాలకు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఆ రాద్ధాంతంతో వారు ముగ్గురు సస్పెండ్ అయ్యారు కూడా. వారిపై సస్పెన్షన్ పడటంతో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుతో సహా వాకౌట్ చేశారు.
ఇలా నూతన సభ సమావేశంలో సభ్యుల సస్పెన్షన్, వాకౌట్ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలంటూ తెలుగుదేశం సభ్యులు డిప్యూటీ స్పీకర్ ను వెళ్లి కలిశారు.