పగవాడికి కూడా ఈ కష్టం వద్దు. ఇష్టమైన గుర్తు కళ్లముందు కనిపిస్తుంది. కానీ ఆ గుర్తుపై ఓటు వేయలేని పరిస్థితి. గాజు గ్లాసు ఎదురుగా మీట నొక్కలేని దుస్థితి. తిరుపతి బై-పోల్ లో జనసైనికులకు ఎదురుకాబోతున్న విచిత్ర పరిస్థితి ఇది. అవును తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాన్, సైకిల్, కమలం, హస్తం.. గుర్తులతోపాటు గాజు గ్లాసు గుర్తు కూడా ఈవీఎంలలో ఉంటుంది. కానీ జనసైనికులు ఓటు వేయలేరు, వాళ్ల బాధ వర్ణనాతీతం.
ఇప్పటి వరకూ గాజు గ్లాసు గుర్తు జనసేనదే అని అందరూ అనుకుంటున్నారు. కానీ జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడం, పైగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయకపోవడంతో.. గాజు గ్లాసు గుర్తుని మరొకరికి కేటాయించారు. నవతరం పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కి ఈ గుర్తుని కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
నవతరం పార్టీకి కూడా జనసేనలాగే గుర్తింపు లేకపోవడంతో.. ఈ ఉప ఎన్నికల వరకు గ్లాసు గుర్తు వారికి ఫిక్స్ చేశారు. ఆల్రడీ గ్లాసు గుర్తుతో సదరు అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ఈ ప్రచారంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కమలం వర్సెస్ గ్లాసు..పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనతో కాస్తో కూస్తో ఊపు వచ్చిందనుకుంటున్న వేళ, సడన్ గా ఇలా గాజు గ్లాసు తెరపైకి రావడంతో బీజేపీ నేతలు షాకవుతున్నారు.
జనసైనికులు గ్లాసు గుర్తుపై ఓటేశారంటే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారు. అయితే అధికారికంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేయండని పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నా ఆయన్ని రెండు చోట్లా ఓడించిన ప్రజలు, ఇప్పుడు పొరపాటున ఆ గుర్తుకి ఓటు వేస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఏదేమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో గ్లాసు గుర్తుని ఓ అభ్యర్థికి కేటాయించడం మాత్రం నిజంగా విశేషమే.
బీజేపీ అసహనం..తిరుపతి ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుని కేటాయించడం రాజకీయ కుట్రేనంటూ మండిపడుతున్నారు బీజేపీ నేతలు. వైసీపీ కుట్ర వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాత్రం.. ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.
నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులనే అభ్యర్థులకు ఇచ్చామని చెప్పారాయన. దీంతో గాజు గ్లాసు బరిలో ఉండటం ఖాయమని తేలిపోయింది. అయితే బీజేపీ, జనసేన నాయకులు మాత్రం ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, కుదరకపోతే కోర్టు కెళ్తామని అంటున్నారు.