రోజుల వ్యవథిలో 3 ఫేమస్ హోటల్స్ సీజ్

హైదరాబాద్ రెస్టారెంట్స్ కు ఫేమస్. బిర్యానీ నుంచి కాంటినెంటల్ రుచులు వరకు హైదరాబాద్ లో దొరకనిది లేదు. అరేబియన్, యూరోపియన్, అమెరికన్, మిడిల్-ఈస్ట్ రుచులతో పాటు.. నార్త్-సౌత్ కు చెందిన దాదాపు అన్ని రుచులు…

హైదరాబాద్ రెస్టారెంట్స్ కు ఫేమస్. బిర్యానీ నుంచి కాంటినెంటల్ రుచులు వరకు హైదరాబాద్ లో దొరకనిది లేదు. అరేబియన్, యూరోపియన్, అమెరికన్, మిడిల్-ఈస్ట్ రుచులతో పాటు.. నార్త్-సౌత్ కు చెందిన దాదాపు అన్ని రుచులు లభ్యమౌతాయి. ఒక్కో హోటల్ ఒక్కో రుచికి ఫేమస్.

అయితే ఊహించని విధంగా ఇలా ఫేమస్ అయిన రెస్టారెంట్లలో 3 ఒకేసారి సీజ్ అవ్వడం ఆశ్చర్యకరం. వివిధ కారణాల వల్ల, రోజుల వ్యవథిలోనే హైదరాబాద్ లోని 3 ఫేమస్ హోటల్స్ సీజ్ చేశారు. వీటిలో ఒకటి మెరెడియన్ రెస్టారెంట్.

పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ మెరెడియన్ రెస్టారెంట్ సుపరిచితం. హైదరాబాద్ టాప్ బిర్యానీల్లో ఈ హోటల్ బిర్యానీ కూడా ఒకటి. ఇలాంటి రెస్టారెంట్లో భోజనం చేయడానికి వచ్చిన ఓ కస్టమర్ కు, సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అదనంగా పెరుగు అడిగినందుకు జరిగిన గొడవ అది. అది కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆ తర్వాత శృతిమించింది. ఫలితంగా ఆ కస్టమర్ చనిపోయాడు. దీంతో హోటల్ ను సీజ్ చేశారు.

ఇలాంటిదే మరో ఫేమస్ హోటల్ వరలక్ష్మి టిఫిన్స్. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లందరికీ సుపరిచితం ఈ హోటల్. వీళ్లకే కాదు, ఎంతోమంది సినీజనాలకు కూడా ఈ హోటల్ లో రుచులు ఇష్టం. ఇలాంటి హోటల్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ హోటల్ ఓనర్ ను మాదకద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఆ వెంటనే హోటల్ ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఇది తెరుచుకుంది.

తాజాగా సీజ్ అయిన మరో రెస్టారెంట్ ఆల్ఫా కేఫ్. సికింద్రాబాద్ వాసులకు పరిచయం అక్కర్లేని పేరిది. సికింద్రాబాద్ లో రైలు ఎక్కే చాలామంది ప్రయాణికులకు ఆల్ఫా కేఫ్ లో బిర్యానీ తిని, టీ తాగి ట్రయిన్ ఎక్కడం అలవాటు. ఇక్కడ కూడా బిర్యానీ చాలా ఫేమస్. ఇలాంటి హోటల్ ను ఇప్పుడు సీజ్ చేశారు.

ఈమధ్య ఇక్కడ భోజనం చేసిన కొంతమంది యువకులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో హోటల్ ను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహణ లేకపోవడంతో, ఆల్ఫా కేఫ్ ను ఈరోజు సీజ్ చేశారు. ఇలా రోజుల వ్యవథిలో హైదరాబాద్ కు చెందిన 3 ఫేమస్ హోటల్స్ వార్తల్లో నిలిచాయి.